కొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా చేసిన కృషిని కొన్ని గంటల్లో అక్షరాల రూపంలో వ్యక్తపరచాల్సిన సమయం ఇది. ఈ తక్కువ సమయంలోనే మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవారికే విజయం దక్కుతుంది. ఇందుకు ఆత్మవిశ్వాసం ప్రధాన ఆయుధం, సానుకూల దృక్పథం ముఖ్యమైన ఇంధనం. ఈ రెండింటితో పరీక్ష హాలులోకి అడుగు పెట్టిన విద్యార్థులకు ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తుకు వస్తుంది. అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి ఫలితాలు సాధించగలుగుతారు.
పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు అందరికీ ఒకేలా ఉంటాయి. ఏడాది నుంచి చదివిన పాఠ్యాంశాల నుంచే అవి ఉంటాయి. వాటిని క్రమబద్ధంగా, స్పష్టంగా జవాబు పత్రంలో రాయడమే ముఖ్యమైన పని. మీ జవాబు పత్రమే మీ ప్రతిభకు ప్రమాణం. అందువల్ల ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా శ్రద్ధగా, జాగ్రత్తగా రాయాలి. తెలిసిన విషయాలను ఒత్తిడిలేకుండా పద్ధతిగా సమాధానాలుగా పేర్చాలి. మూల్యాంకనం చేసే వారికి అవి స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి.
పరీక్ష సమయంలో ఆందోళన, ఒత్తిడి లేదా మనసు ఎక్కడికైనా మళ్లితే తెలిసిన ప్రశ్నలకే గందరగోళం ఏర్పడుతుంది. జవాబు తెలిసినా కలం ముందుకు కదలదు. అందుకే పరీక్షలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం, మానసిక సిద్ధత చాలా అవసరం. వీటిని పాటించిన విద్యార్థులు ఆనందంగా పరీక్షలు రాసి, ఆశించిన ఫలితాలను సాధిస్తారు.
పరీక్ష రోజు పాటించాల్సిన విషయాలు
పరీక్షకు వెళ్లే ముందు అవసరమైన వస్తువులు — హాల్ టికెట్, రెండు పెన్నులు, పెన్సిల్, రబ్బరు, నీళ్ల సీసా, రుమాలు, అవసరమైన డబ్బులు — అన్నీ ఉన్నాయో లేదో ముందుగా చూసుకోవాలి. పరీక్ష కేంద్రానికి వెళ్లే సమయంలో కొత్తగా ఏమీ చదవకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. నిర్ణయించిన సమయానికి కనీసం అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.
హాలులోకి వెళ్లే ముందు అవసరమైన పనులు పూర్తిచేసుకుని వెళ్లాలి. పరీక్ష హాలులోకి వెళ్లేటప్పుడు ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టాలి. కొద్దిసేపు లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదిలితే మనసు ప్రశాంతంగా ఉంటుంది.ప్రశ్నాపత్రం అందుకున్న తర్వాత అన్ని ప్రశ్నలను ఒకసారి పూర్తిగా చదవాలి. కష్టంగా అనిపించే ప్రశ్నలు కనిపించినా ఆందోళన చెందకండి. అవి మిగతా విద్యార్థులకు కూడా కష్టంగానే ఉండొచ్చు. బాగా తెలిసిన ప్రశ్నతో జవాబు ప్రారంభించడం మంచిది. ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.వసరమైన ప్రశ్నలకే సమాధానాలు రాయాలి. సమయం మిగిలితే మాత్రమే అదనపు సమాధానాల గురించి ఆలోచించాలి. మధ్యలో జవాబు గుర్తు రాకపోతే కొంత ఖాళీ వదిలి మరో ప్రశ్నకు వెళ్లి, చివర్లో తిరిగి ప్రయత్నించాలి.పరీక్ష ముగియడానికి కనీసం పది నిమిషాల ముందే రాయడం పూర్తి చేసి జవాబులు సరిచూసుకోవాలి. ప్రశ్న నంబర్లు, సెక్షన్లు సరిగా ఉన్నాయా చూడాలి. అదనపు పత్రాలు క్రమంగా అమర్చాయా లేదో చూసుకోవాలి. హాల్ టికెట్ నంబర్ కూడా మరోసారి పరిశీలించాలి.
చేతిరాత (దస్తూరీ)
జవాబులు స్పష్టంగా చదవగలిగేలా రాయాలి. చేతిరాత స్పష్టంగా లేకపోతే పదాలు, వాక్యాల మధ్య కొద్దిగా ఖాళీ ఇవ్వాలి. కొట్టివేతలు తగ్గించాలి. అచ్చు తప్పులు, అన్వయ దోషాలు లేకుండా రాస్తే మంచి ప్రభావం ఉంటుంది.
సమయ నిర్వహణ
ప్రశ్నకు ఇచ్చిన మార్కులను బట్టి సమయాన్ని నిర్ణయించుకోవాలి. నిర్దిష్ట సమయంలోనే సమాధానం పూర్తి చేయాలి. అప్పుడప్పుడు గడియారాన్ని చూసుకుంటూ రాయాలి. ఎక్కువగా రాస్తేనే ఎక్కువ మార్కులు వస్తాయని అనుకోవద్దు. అడిగిన మేరకే, అవసరమైనంత వరకే రాయాలి. ముఖ్యమైన పదాలు (కీవర్డ్స్) ఉపయోగించడం చాలా ముఖ్యం.
పరీక్ష తర్వాత
పరీక్ష పూర్తయ్యాక ప్రశాంతంగా బయటకు రావాలి. ఇతరులతో జవాబుల గురించి చర్చించకపోవడం మంచిది. చేసిన తప్పులను గుర్తుచేసుకుంటూ దిగులు చెందకండి. రాసిన జవాబు సరైందా కాదా అని వెంటనే పుస్తకాలు చూసుకోవద్దు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక సమీక్షించడానికి సమయం ఉంటుంది.తదుపరి పరీక్షపై దృష్టి పెట్టాలి. ముందు పరీక్షలో చిన్న తప్పులు జరిగినా వాటిని మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. కొత్తగా చదవడం కంటే ఇప్పటికే చదివిన విషయాలను రివిజన్ చేయడం మంచిది.
ఇవి కూడా గుర్తుంచుకోండి
ఖాళీ కడుపుతో పరీక్షకు వెళ్లకూడదు. ఆహారం తీసుకోకపోతే మెదడు చురుకుగా పనిచేయదు. ఇడ్లీ, అరటిపండు, చిక్కీ వంటి తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. తగినంత నీళ్లు తాగాలి.వాతావరణం వేడిగా ఉండే అవకాశం ఉండటంతో సౌకర్యంగా ఉండే లేత రంగు దుస్తులు ధరించడం మంచిది. పరీక్షల రోజుల్లో రాత్రి ఎక్కువసేపు మేల్కొని చదవకూడదు. కనీసం ఏడు గంటల నిద్ర తప్పనిసరి. అప్పుడు మాత్రమే చదివినవి స్పష్టంగా గుర్తుంటాయి.ఆత్మవిశ్వాసం, శ్రద్ధ, సమయపాలనతో పరీక్షలు రాస్తే విజయం ఖచ్చితంగా మీ సొంతమవుతుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















