రెవెన్యూ శాఖలో దరఖాస్తుల పరిష్కారానికి జరుగుతున్న జాప్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణ పరిపాలనలో అధికారులు సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఒకే తరహా సమస్యలపై ప్రజలు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది.
ఎఫ్‌లైన్ దరఖాస్తుల పరిష్కారం, భూ రికార్డుల సవరణలు, కనిపించని సర్వే నంబర్ల నమోదు, మ్యుటేషన్ వంటి రెవెన్యూ అంశాలపై వరుసగా పిటిషన్లు దాఖలవుతున్నాయని హైకోర్టు పేర్కొంది. ప్రజలకు అందాల్సిన సేవలను నిర్ణీత గడువులోగా అందిస్తే ఇలాంటి సమస్యలు కార్యాలయ స్థాయిలోనే పరిష్కారం అవుతాయని తెలిపింది.
రెవెన్యూ సేవలకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలు ఉండేలా ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ) రూపొందించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఈ ఎస్‌ఓపీపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని సూచించింది.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన హన్మండ్లు మ్యుటేషన్ కోసం గత ఏడాది అక్టోబరులో దరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటివరకు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దరఖాస్తు సమర్పించి ఎనిమిది నెలలు గడిచినా మ్యుటేషన్ ప్రక్రియపై రెవెన్యూ అధికారులు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపారు. అధికారులు నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదిస్తూ.. ఒకే రకమైన దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడం వల్ల వాటి పరిష్కారంలో ఆలస్యం జరుగుతోందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో రెవెన్యూ కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారని, అయితే అక్కడ పరిష్కారం లభించకపోతే చివరి మార్గంగా కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.
చట్టబద్ధంగా అందించాల్సిన రెవెన్యూ సేవలను అధికారులు సమయానికి అందించేలా వ్యవస్థలో మార్పులు అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. ఎస్‌ఓపీ రూపకల్పనతో దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారుతుందని పేర్కొంది.
నివేదిక సమర్పణ అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది. ఉత్తర్వుల ప్రతిని బుధవారంలోగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















