ఒక చిన్న పల్లెటూరులో అప్పారావు అనే ఒక అమాయకపు ఆసామి ఉండేవాడు. అతనికి దేవుడంటే మహా భక్తి, కానీ తెలివితేటలు మాత్రం కాస్త తక్కువే!
ఒక రోజు ఊర్లోకి ఒక పెద్ద సాధువు వచ్చాడు. ఊరి జనాలు అందరూ ఆయన చుట్టూ చేరి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అప్పారావు కూడా గుంపులో దూరి, “స్వామీ! నా జీవితంలో అసలు సుఖమే లేదు. నాకు ఏదైనా సింపుల్ మంత్రం చెప్పండి, దాన్ని జపిస్తే నా కష్టాలన్నీ తీరిపోవాలి” అని వేడుకున్నాడు.
సాధువు నవ్వి, “సరే అప్పారావు, నేను నీకు ఒక శక్తివంతమైన మంత్రం ఇస్తాను. రోజూ ఉదయాన్నే స్నానం చేసి, ‘ఓం శ్లోకాయ నమః’ అని 108 సార్లు జపించు. కానీ ఒకే ఒక కండిషన్… ఈ మంత్రం జపించేటప్పుడు నీ మనసులోకి కోతి రాకూడదు. కోతి గురించి ఆలోచిస్తే ఈ మంత్రం పనిచేయదు” అని చెప్పాడు.
“అంతేగా సాధువు గారూ! నా జీవితంలో నేను ఎప్పుడూ కోతి గురించి ఆలోచించలేదు. నా మనసులోకి కోతి ఎందుకు వస్తుంది? చాలా ఈజీ!” అని చెప్పి సంతోషంగా ఇంటికి వెళ్లాడు అప్పారావు.
మరుసటి రోజు ఉదయాన్నే అప్పారావు తలస్నానం చేసి, పూజా గదిలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు.
“ఓం శ్లో…” అనుకోగానే… టక్కున మనసులో ఒక పెద్ద కోతి కొమ్మలు పట్టుకుని ఊగుతున్నట్టు కనిపంచింది!
అప్పారావు కళ్ళు తెరిచి, “ఛచ్ఛా! సాధువు గారు వద్దన్నారు కదా, ఈ కోతి ఏంటి మధ్యలో వచ్చింది?” అనుకుని, కాళ్ళు చేతులు కడుక్కుని మళ్ళీ కూర్చున్నాడు.
“ఓం శ్లోకాయ…” అనుకునేలోపే ఈసారి ఒక పది కోతులు వచ్చి మనసులో అరటిపళ్ళు తింటున్నాయి!
పాపం అప్పారావుకి చెమటలు పట్టేశాయి. “ఎప్పుడూ లేనిది ఈ కోతి ఈరోజే నా మనసులోకి ఎందుకు వస్తోంది?” అని జుట్టు పీక్కున్నాడు. కళ్ళు మూస్తే కోతి, కళ్ళు తెరిచినా కోతే! ఆఖరికి కంచంలో అన్నం తింటున్నా కోతే కనిపిస్తోంది. సాయంత్రానికి అప్పారావుకి పిచ్చెక్కిపోయినంత పనైంది.
మరుసటి రోజు పరిగెత్తుకుంటూ సాధువు దగ్గరకు వెళ్ళి, ఆయ న కాళ్ళ మీద పడిపోయాడు.
“స్వామీ! మీ కాళ్ళు మొక్కుతాను, ఆ మంత్రం నాకొద్దు, ఏమొద్దు! మీరు కోతి గురించి చెప్పకముందు వరకు నా మనసులో ఎప్పుడూ కోతి లేదు. కానీ మీరు వద్దని చెప్పినప్పటి నుండి నా ప్రపంచమంతా కోతులతోనే నిండిపోయింది! ఆ కోతిని నా మనసులోంచి తీసేసే కొత్త మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి ప్లీజ్!” అని ఏడ్చేశాడు.
సాధువు బిగ్గరగా నవ్వి, “చూశావా అప్పారావు! మన మనస్సు కూడా అంతే. దేన్నైతే వద్దు అనుకుంటామో, దాన్నే ఎక్కువ ఆలోచిస్తుంది. కోతిని తరమడం కాదు, మంత్రాన్ని మాత్రమే పట్టుకోవడం అలవాటు చేసుకో” అని జ్ఞానోదయం చేశాడు.
అప్పటి నుండి అప్పారావు మంత్రాలు జపించడం మానేసి, ప్రశాంతంగా తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టాడు!
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















