వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. గోదావరి జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు కలిసే ఉపనదులు, వాగులు, ఏరులను దృష్టిలో ఉంచుకుని ‘అఖండ గోదావరి’ పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
పుష్కరాల కోసం రూ.4,026 కోట్లతో చేపట్టనున్న పనులను సకాలంలో పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ యంత్రాంగంతోనే కాకుండా స్థానిక ప్రజలను కూడా పుష్కరాల నిర్వహణలో భాగస్వాములను చేయాలని సూచించారు. భక్తులకు వసతి కల్పించేందుకు హోమ్ స్టేలను ప్రోత్సహించాలని, కొత్త హోటళ్లకు వేగంగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు.
పిఠాపురం, అన్నవరం, ద్వారకాతిరుమల, వాడపల్లి, అంతర్వేది తదితర ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. రాజమహేంద్రవరంలో భారీ కార్యక్రమాల నిర్వహణకు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంతో పాటు కూచిపూడి వంటి సాంస్కృతిక కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
గత గోదావరి పుష్కరాల్లో 4.86 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయగా, వచ్చే పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న 259 ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు మరో 181 కొత్త ఘాట్లను నిర్మిస్తున్నారు. భక్తుల రద్దీ నియంత్రణ, భద్రత కోసం ఏఐ ఆధారిత క్రౌడ్ ఎనలిటిక్స్, సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, క్యూఆర్ కోడ్ ఆధారిత వాహన గుర్తింపు వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు.
అత్యవసర వైద్య సేవల కోసం 30 తాత్కాలిక ఫీల్డ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నారు. 11 బస్‌స్టేషన్లను ఆధునికీకరించడంతో పాటు 2,697 రెస్క్యూ బోట్లు, 8,955 మంది గజఈతగాళ్లను సిద్ధం చేస్తున్నారు. ఆరు పుష్కర జిల్లాల్లో రహదారులు, వంతెనలు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















