హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన డా.మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (డా.ఎంసీఆర్ టిమ్స్)ను అంతర్జాతీయ స్థాయి వైద్య కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా విదేశీ రోగులకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశీ రోగుల కోసం టిమ్స్‌లో ప్రత్యేకంగా 50 పడకలను కేటాయించారు.
విదేశీ రోగులకు కేటాయించిన వార్డుల నిర్వహణ, పర్యవేక్షణతో పాటు వివిధ దేశాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం, అనువాద సేవలు అందించడం వంటి అంశాలను పర్యవేక్షించేందుకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ టూరిజం ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే రోగులకు చికిత్సకు ముందు, చికిత్స సమయంలో, అనంతరం అవసరమైన సేవలను సమన్వయం చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉండనుంది.
అవయవ మార్పిడి, గుండె శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్స, న్యూరో, ఆర్థోపెడిక్, యూరాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ తదితర విభాగాల్లో వైద్య సేవలను తక్కువ ఖర్చుతో అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలకు డిమాండ్ ఉన్న విభాగాలను బలోపేతం చేయడం ద్వారా విదేశీ రోగులను ఆకర్షించాలని భావిస్తోంది.
విదేశీ రోగులు చికిత్స కోసం వచ్చినప్పుడు ఆరోగ్య బీమా, చెల్లింపులు, భాష, ఇతర పరిపాలనా అంశాల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా ఆయా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆఫ్రికా, అరబ్ దేశాల నుంచి వచ్చే రోగులకు సంబంధించిన అవకాశాలపై ఆయా దేశాలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
టిమ్స్‌లో వైద్య సేవలకు నిమ్స్ తరహాలో ఫీజులు వసూలు చేయాలని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తాజాగా నిర్ణయించింది. అదే సమయంలో ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు. ఈ విధంగా ఒకవైపు అంతర్జాతీయ రోగులకు అందుబాటులో ఉండే వైద్య సేవలను విస్తరించడం, మరోవైపు పేదలకు ఉచిత చికిత్స అందించడం ద్వారా టిమ్స్‌ను కీలక వైద్య కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















