పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరగడం మదుపర్లలో ఆందోళనకు దారితీసింది. దీంతో సోమవారం సూచీలు రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. ముఖ్యంగా యుటిలిటీస్, లోహాలు, సేవలు, కమొడిటీస్, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ ఉదయం 134 పాయింట్ల నష్టంతో 77,130.73 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 513.19 పాయింట్లు క్షీణించి 76,751.32 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 307.24 పాయింట్ల నష్టంతో 76,957.27 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95.25 పాయింట్లు తగ్గి 24,080.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 23,993.60 నుంచి 24,128.70 పాయింట్ల మధ్య కదలాడింది.
విదేశీ సంస్థాగత మదుపర్లు భారీగా విక్రయాలు చేపట్టారు. ఎఫ్‌ఐఐలు రూ.7,986 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.4,589 కోట్ల కొనుగోళ్లు జరిపారు. అయినప్పటికీ అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల కారణంగా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది.
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 20 నష్టాలను చవిచూశాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
ముడిచమురు ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. బ్యారెల్ ముడిచమురు ధర 3.63 శాతం పెరిగి 91.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల దేశీయ కంపెనీల వ్యయాలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనలు మదుపర్లలో నెలకొన్నాయి.
మరోవైపు బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.59 లక్షల కోట్లు తగ్గి రూ.490.23 లక్షల కోట్లకు చేరింది. ఆసియా మార్కెట్లలో కొరియా, షాంఘై సూచీలు లాభపడగా.. జపాన్, హాంకాంగ్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఐరోపా మార్కెట్లు కూడా ప్రతికూలంగా ట్రేడయ్యాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు తొలుత లాభాల్లో కనిపించినా చివరకు నష్టంతో ముగిసింది. బ్యాంక్ ఎండీ, సీఈఓ శశిధర్ జగదీశన్ అక్టోబరులో పదవీకాలం పూర్తయ్యాక పునర్నియామకానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో షేరు ఇంట్రాడేలో 2.70 శాతం లాభపడి రూ.739.50కి చేరింది. అనంతరం లాభాల స్వీకరణతో 1.53 శాతం నష్టపోయి సుమారు రూ.709 వద్ద ముగిసింది.
ఇక ఆగ్‌మాంట్ ఎంటర్‌ప్రైజెస్ షేరు మార్కెట్లోకి అదిరిపోయే ఆరంభం చేసింది. రూ.788 ఇష్యూ ధరతో పోలిస్తే బీఎస్‌ఈలో 21.31 శాతం లాభంతో రూ.956 వద్ద నమోదైంది. ఇంట్రాడేలో రూ.1,019 గరిష్ఠాన్ని తాకిన ఈ షేరు చివరకు 15.19 శాతం లాభంతో రూ.907.75 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.8,294.43 కోట్లుగా నమోదైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

















