జనసేన పార్టీకి యువతే ప్రధాన బలమని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా పిఠాపురంలో పార్టీ యువజన విభాగం ‘జైకొట్టు’ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన పిడికిలి గుర్తుతో కూడిన ‘జైకొట్టు’ లోగోను విడుదల చేశారు.
జనసేన చేపట్టిన ప్రతి ఉద్యమం, పోరాటం, పిలుపు, గెలుపులో యువత కీలకంగా నిలిచిందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. యువత ఆలోచనలు, ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ వారికి మరింత ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో ‘జైకొట్టు’ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తిత్లీ తుపాను సమయంలో ఉత్తరాంధ్రలో చోటుచేసుకున్న ఘటనను మంత్రి గుర్తుచేశారు. సిక్కోలుకు చెందిన యువకుడు గర్బాన సత్తిబాబు.. తమకు 25 కేజీల బియ్యం కంటే 25 ఏళ్ల భవిష్యత్తు కావాలని పవన్ కల్యాణ్‌ను కోరిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ యువకుడి ఆలోచనను పార్టీ నినాదంగా స్వీకరించామని చెప్పారు.
అదేవిధంగా నల్లమలలో యురేనియం తవ్వకాల అంశంపై యువకుడు శివ ప్రస్తావించిన సమస్యను పవన్ కల్యాణ్ తీవ్రంగా పరిగణించారని అన్నారు. అధికారంలో లేకపోయినా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాడారని గుర్తుచేశారు. యువత ఆలోచనలకు పవన్ కల్యాణ్ ఎప్పుడూ విలువ ఇస్తారని పేర్కొన్నారు.
2019 తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటూ యువత ముందుండి పోరాడిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలను అడ్డుకోవడంలో యువతరం కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
యువత ఆలోచనలు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా ‘జైకొట్టు’ను తీసుకొచ్చామని చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున యువతతో పాటు వీర మహిళలకు కూడా ప్రాధాన్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.
‘జైకొట్టు’ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన యువతను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఆడియో సందేశాన్ని పంపించారు. దేహీ అని దేబిరించే చేతులు కాకుండా దేశం కోసం పోరాడే పిడికిళ్లు కావాలని, ఎక్కడున్నాననే ప్రశ్నార్థకపు చేతులు కాకుండా నేనిక్కడే ఉంటాననే అస్తిత్వాన్ని చాటే పిడికిళ్లు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇన్నాళ్లూ నాయకులు, పార్టీల కోసం, ఓట్ల కోసం జిందాబాద్‌లు కొట్టామని.. ఇక యువత కోసం, వారి భవిత కోసం ‘జైకొట్టు’ అని పిలుపునిచ్చారు. మార్పు కోసం, ఆ మార్పు తెచ్చే తీర్పు కోసం, పట్టు వదలని జనం కోసం, పోరాడే సేన కోసం జైకొట్టాలని సందేశంలో పేర్కొన్నారు.
కార్యక్రమానికి ముందు పిఠాపురంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం 54 కేజీల కేక్‌ను కోసి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన యువకుడి కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ఫ్లెక్సీ కడుతుండగా ప్రేమ్‌కుమార్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
మృతుడి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అందించారు. ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్ తండ్రి సతీష్‌తో మాట్లాడి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

















