చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత సీనియర్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ విజయంతో బోణీ కొట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-16, 21-15తో చి యు జెన్ (చైనీస్ తైపీ)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. రెండో రౌండ్లో కెనడాకు చెందిన విక్టర్ లాయ్‌తో శ్రీకాంత్ తలపడనున్నాడు.
మరోవైపు భారత నంబర్‌వన్ పురుషుల సింగిల్స్ ఆటగాడు లక్ష్యసేన్‌కు మాత్రం నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లోనే అతడు విక్టర్ లాయ్ చేతిలో 14-21, 7-21తో పరాజయం పాలయ్యాడు. మ్యాచ్ ఆరంభంలో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లిన లక్ష్య.. ఆ తర్వాత లయను కోల్పోయాడు. లాయ్ క్రమంగా పుంజుకుని ఆటను తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. తొలి గేమ్‌ను సులువుగా ముగించిన అతడు.. రెండో గేమ్‌లో మరింత దూకుడుగా ఆడి లక్ష్యకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గత నెల కాంస్య పతకం సాధించిన లాయ్.. లక్ష్యపై మరోసారి పైచేయి సాధించాడు. వీరిద్దరూ ఇప్పటివరకు నాలుగుసార్లు తలపడగా.. లాయ్ మూడు విజయాలు సాధించాడు. లక్ష్యకు ఒక్క విజయం మాత్రమే దక్కింది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ లక్ష్య రెండో రౌండ్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
మహిళల సింగిల్స్‌లో యువ షట్లర్ తన్వి శర్మ విజయంతో టోర్నీని ప్రారంభించింది. తొలి రౌండ్లో డెన్మార్క్‌కు చెందిన అమైల్ షుల్జ్‌ను 21-16, 21-17తో ఓడించి రెండో రౌండ్‌కు చేరుకుంది. తదుపరి పోరులో జపాన్ క్రీడాకారిణి తొమోకా మియాజకితో తన్వి తలపడనుంది.
పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి కూడా రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. తొలి రౌండ్లో జునైది ఆరిఫ్-కాంగ్ కై జింగ్ (మలేసియా) జోడీపై 21-11, 21-6తో ఘన విజయం సాధించింది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ కూడా అలవోకగా ముందంజ వేసింది. తొలి రౌండ్లో తొనాకోర్న్ సేహెంగ్-తొనిచా సేహెంగ్ జోడీని 21-8, 21-9తో చిత్తు చేసి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















