తెలంగాణ శాసనసభలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై భారాస ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. స్పీకర్ పదవిని, శాసనసభ గౌరవాన్ని, రాష్ట్ర ప్రజల మనోభావాలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ.. తాతా మధుతో రాజీనామా చేయించాలని, కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
స్పీకర్ ప్రసాద్‌కుమార్ సైతం ఈ ఘటనపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధించాయని పేర్కొంటూ కంటతడి పెట్టారు. దీంతో సభలో కొంతసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. స్పీకర్ మాతృమూర్తిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనను కాంగ్రెస్ సభ్యులతోపాటు భాజపా, మజ్లిస్, సీపీఐ సభ్యులు కూడా ఖండించారు. చట్టసభలో సభాపతి స్థానానికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని పేర్కొన్నారు. తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘చట్టసభల గౌరవాన్ని కాపాడాలి’
అసెంబ్లీలో ప్రత్యేక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వతంత్ర భారత చరిత్రలో ఒక సభాపతిని ఇంత అభ్యంతరకరంగా అవమానించిన ఘటన అరుదని అన్నారు. సభలో ముఖ్యమంత్రైనా, ఎమ్మెల్యే అయినా స్పీకర్ ఎదుట అందరూ సమానమేనని స్పష్టం చేశారు.
స్పీకర్ పదవి అత్యున్నతమైనదని, ఆ స్థానాన్ని గౌరవించడం శాసనసభ సంప్రదాయమని పేర్కొన్నారు. వ్యక్తిగత రాజకీయ విభేదాలను సభాపతి స్థానంతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను క్షమిస్తే చట్టసభల గౌరవం, సంప్రదాయాలు దెబ్బతింటాయని హెచ్చరించారు.
ఈ ఘటనను గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వ్యక్తిగతంగా జరిగిన అవమానంగా చూడకూడదని.. మొత్తం శాసన వ్యవస్థకు జరిగిన అవమానంగా భావించాలని సీఎం అన్నారు. కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలను ప్రేరేపించి స్పీకర్‌పై దాడి చేయించేలా వ్యవహరించారని ఆరోపించారు. తాతా మధు వ్యాఖ్యలకు కేసీఆర్ బాధ్యత వహించాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పడంతోపాటు ఆయనతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
దళిత అంశాన్ని ప్రస్తావించిన సీఎం
భారాస హయాంలో దళితులకు ఇచ్చిన హామీలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి హామీ నెరవేర్చలేదని విమర్శించారు. దళిత ఉపముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు. దళిత నాయకుడిని సీఎల్పీ నాయకుడిగా చేస్తే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఆరోపించారు.
భారాసది దళిత వ్యతిరేక వైఖరి అని కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.
పార్టీలకు అతీతంగా ఖండన
తాతా మధు వ్యాఖ్యలను మంత్రులు శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క తదితరులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
భాజపా, మజ్లిస్ సభ్యులు కూడా తాతా మధుతో రాజీనామా చేయించాలని కోరారు. మరోవైపు భాజపా సభ్యులు 22ఏ అంశంపై చర్చించాలని కోరుతూ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం అక్కడే బైఠాయించారు.
ఈ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్‌ను అత్యంత అవమానకరంగా ఉద్దేశించిన అంశం కంటే సభలో చర్చించాల్సిన ముఖ్యమైన విషయం మరొకటి ఏముంటుందని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని సభ్యులకు సూచించారు.
‘తాతా మధు వ్యాఖ్యలు బాధాకరం’
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాతా మధు చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని తెలిపారు. మంత్రి సీతక్క ఐదేళ్లుగా తనకు రాఖీ కడుతున్నారని, ఆమె సభలో కన్నీరు పెట్టుకుని మాట్లాడటం తనను మరింత కలచివేసిందని చెప్పారు.
తాతా మధు వ్యాఖ్యలపై శాసనసభలో తీర్మానం చేసి శాసనమండలికి పంపుతామని స్పీకర్ తెలిపారు. సభాపతి స్థానానికి ఉన్న గౌరవాన్ని కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంతో తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. సభా సంప్రదాయాలు, స్పీకర్ గౌరవం, సభ్యుల ప్రవర్తనపై తీవ్ర చర్చకు దారితీసిన ఈ ఘటనపై తదుపరి ఎలాంటి చర్యలు ఉంటాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















