తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్రానికి సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు రెండు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలు, ఐటీ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు స్థానిక యువతకు పెద్దఎత్తున అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
దావోస్ పర్యటనలో కుదిరిన ఒప్పందాలను కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో కుదిరిన ఎంవోయూల్లో 23 శాతం ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని, రెండేళ్లలో దావోస్‌లో కుదిరిన ఒప్పందాల్లో దాదాపు 45 శాతం అమల్లోకి వచ్చాయని వివరించారు. పెట్టుబడులకు అనుగుణంగా మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు.
హైదరాబాద్‌లో ఐటీ రంగం మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో నగరంపై ఒత్తిడిని తగ్గించేందుకు ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే 75కు పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు) హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయని తెలిపారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, ఈ రంగానికి మరింత ఊతమిచ్చేలా త్వరలో ప్రత్యేక విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు.
గతంలో నిర్మించిన కొన్ని ఐటీ హబ్‌లు, టవర్లు కంపెనీల భాగస్వామ్యం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో వినియోగంలోకి రాలేదని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆదిలాబాద్ ఐటీ టవర్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు, నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని పారిశ్రామిక అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లాలని శ్రీధర్‌బాబు అన్నారు. హరిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తూ పర్యావరణానికి అనుకూలమైన పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఫార్మా, ఐటీ, డేటా సెంటర్లు, జీసీసీలతో పాటు ఇతర రంగాల్లోనూ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ఐటీ కంపెనీలకు కేటాయించిన భూములను ఇతర అవసరాలకు, ముఖ్యంగా స్థిరాస్తి వ్యాపారాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. భూముల కేటాయింపులపై స్పష్టమైన నిబంధనలు, పర్యవేక్షణ అవసరమన్నారు. పెట్టుబడిదారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని సూచించారు. వివిధ పార్టీల సభ్యులు తమ నియోజకవర్గాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















