ఇరాన్‌తో జరిగిన యుద్ధం అమెరికా రక్షణ రంగంపై తీవ్ర ప్రభావం చూపినట్లు పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు చోటుచేసుకున్న నష్టాలను పరిశీలించిన అధికారులు.. అమెరికా వద్ద ఉన్న అధునాతన ఆయుధాల నిల్వలు గణనీయంగా తగ్గిపోయినట్లు పేర్కొన్నారు. యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి ఆయుధ నిల్వలను తీసుకురావడం అంత సులభం కాదని, సరఫరా వ్యవస్థలో పలు అడ్డంకులు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. నిపుణుల అంచనా ప్రకారం.. ఆయుధ నిల్వలను మునుపటి స్థాయికి తీసుకురావడానికి సుమారు మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.
యుద్ధ ప్రభావం అమెరికా సైనిక సామర్థ్యాలపైనే కాకుండా విదేశాల్లోని దౌత్య కార్యాలయాలు, సైనిక స్థావరాలపైనా పడింది. ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలోని అమెరికా దౌత్య కార్యాలయాలకు సుమారు 184 మిలియన్ డాలర్ల మేర నష్టం జరిగినట్లు నివేదిక తొలిసారిగా వెల్లడించింది. ఇదే సమయంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న దాదాపు 9,000 మంది అమెరికా పౌరులను స్వదేశానికి తరలించినట్లు తెలిపింది. ఈ తరలింపు చర్యలకు జూన్ చివరి నాటికి 11 మిలియన్ డాలర్లకుపైగా ఖర్చు చేసినట్లు పేర్కొంది.
ఇరాన్ దాడుల కారణంగా కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, ఒమన్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాల్లో వందలాది భవనాలు దెబ్బతిన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. భారీ సంఖ్యలో అమెరికా విమానాలు, డ్రోన్లు కూడా ధ్వంసమైనట్లు వెల్లడైంది. యుద్ధానికి ఇప్పటివరకు 37.5 బిలియన్ డాలర్లు ఖర్చయినట్లు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కాంగ్రెస్‌కు వివరించారు.
ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్‌పై దాడి ఘటన అమెరికా-ఇరాన్ మధ్య మరో వివాదానికి దారితీసింది. నావికా దళం అమర్చిన మైన్‌ను ట్యాంకర్ ఢీకొట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చేసిన వాదనను అమెరికా సైన్యం ఖండించింది.
ట్యాంకర్‌ను ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు అమెరికా ఆరోపించింది. ఈ నౌకపై ఇరాన్ రెండుసార్లు దాడి చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) పేర్కొంది. దీంతో ఇరుదేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















