భారత్, అమెరికా మధ్య రక్షణ రంగంలో వ్యూహాత్మక, పారిశ్రామిక భాగస్వామ్యం వేగంగా విస్తరిస్తోందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు. హైదరాబాద్‌లోని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ ప్లాంటును సందర్శించిన ఆయన.. అక్కడ జరుగుతున్న విమాన నిర్మాణ కార్యకలాపాలను పరిశీలించారు. భారతీయ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులు అత్యంత కీలకమైన విమాన నిర్మాణ భాగాలను తయారు చేయడం భారత్–అమెరికా రక్షణ సహకారానికి నిదర్శనమని పేర్కొన్నారు.
అమెరికా, భారత్ వైమానిక దళాలు వినియోగిస్తున్న సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానాలకు అవసరమైన కీలక తోక భాగాలను హైదరాబాద్ ప్లాంటులో తయారు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తయారీ సామర్థ్యం భారత్‌లో అభివృద్ధి చెందడం వల్ల రక్షణ రంగంతో పాటు నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని గోర్ పేర్కొన్నారు. సురక్షితమైన, స్థిరమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, అమెరికా భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు.
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లాక్‌హీడ్ మార్టిన్ సంయుక్త భాగస్వామ్యంతో 2010లో ఏర్పాటైన సంస్థ ప్రస్తుతం సీ-130జే విమానాలకు సంబంధించిన నిర్మాణ భాగాలను తయారు చేస్తోంది. భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 12 సీ-130జే రవాణా విమానాలు ఉన్నాయి. పాత విమానాల స్థానంలో సుమారు 80 మధ్యశ్రేణి రవాణా విమానాలను సమకూర్చుకునే ప్రక్రియలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థలు పోటీపడుతున్నాయి.
ఈ భారీ కాంట్రాక్టు కోసం లాక్‌హీడ్ మార్టిన్ సీ-130జే, ఎంబ్రాయెర్ సి-390 మిలీనియం, ఎయిర్‌బస్ ఏ-400ఎమ్ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఈ ఆర్డర్ లభిస్తే హైదరాబాద్‌లోని తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు టాటా–లాక్‌హీడ్ భాగస్వామ్యం సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్ సేవల కోసం ప్రత్యేక ఎంఆర్‌ఓ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాన్ని డిసెంబరు నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సీఈఓ, ఎండీ సుకరన్ సింగ్ తెలిపారు. 2027 ఏప్రిల్ నాటికి సర్వీసింగ్ కోసం తొలి విమానం ఈ కేంద్రానికి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















