యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన చైనాకు చెందిన వీడియో షేరింగ్ వేదిక బిలిబిలి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించేందుకు కొత్త అవకాశాలను తెరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రతి 1,000 వ్యూస్‌కు సుమారు 0.70 డాలర్లు.. అంటే దాదాపు రూ.60 చెల్లించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చెల్లింపులపై బిలిబిలి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
క్రియేటర్లకు యూట్యూబ్‌తో పోలిస్తే మెరుగైన ఆదాయ అవకాశాలను అందించేందుకు బిలిబిలి ప్రయత్నిస్తోందనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. స్పానిష్ భాషా ఖాతా ఎల్ డుయి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అంతర్జాతీయ కంటెంట్ క్రియేటర్ల కోసం బిలిబిలి మానిటైజేషన్ అవకాశాలను అందుబాటులోకి తీసుకురానుందని పేర్కొంది.
అంతర్జాతీయ వెర్షన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు.. తప్పనిసరి గుర్తింపు ధ్రువీకరణను తొలగించే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది. విదేశీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని స్థానిక కంటెంట్, ప్రత్యేక ఫీచర్లను అందించేందుకు సంస్థ సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి.
2009లో చైనాలో ప్రారంభమైన బిలిబిలి తొలుత యూత్, యానిమేషన్, గేమింగ్, కామిక్స్ వంటి కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది. క్రమంగా విభిన్న వీడియో కంటెంట్‌కు వేదికగా విస్తరించింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌కు 35 కోట్లకు పైగా నెలవారీ క్రియాశీల వినియోగదారులు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
యూట్యూబ్‌లో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మిస్టర్‌బీస్ట్ వంటి ప్రముఖ క్రియేటర్లు బిలిబిలిలోనూ తమ కంటెంట్‌ను అందిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ ప్రేక్షకులపై బిలిబిలి దృష్టి పెడుతున్నట్లు స్పష్టమవుతోంది.
అయితే అంతర్జాతీయ మార్కెట్లలో బిలిబిలికి సవాళ్లు కూడా తక్కువేమీ కావు. యూట్యూబ్‌కు ఇప్పటికే ఉన్న భారీ వినియోగదారుల బేస్, క్రియేటర్ ఎకానమీ, ప్రకటనల వ్యవస్థ వంటి వాటితో పోటీ పడటం అంత సులభం కాదు. అయినప్పటికీ కొత్త ప్రేక్షకులను చేరుకోవడంతో పాటు క్రియేటర్లకు ఆకర్షణీయమైన చెల్లింపులు అందించగలిగితే బిలిబిలి తన అంతర్జాతీయ విస్తరణకు బలమైన పునాది వేసుకునే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















