దీపం-2 పథకం కింద ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు పొందుతున్న లబ్ధిదారులకు రాయితీ సొమ్ము జమ చేసే విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు సిలిండర్ తీసుకున్న తర్వాత రాయితీ ఎప్పుడు ఖాతాలో జమ అవుతుందో స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ఇకపై నిర్ణీత తేదీన నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రాయితీ జమ చేసే విధానంపై అధికారులు చర్చిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం 2024 అక్టోబరు 31న దీపం-2 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. ఏప్రిల్-జులై మధ్య ఒకటి, ఆగస్టు-నవంబరు మధ్య రెండోది, డిసెంబరు-మార్చి మధ్య మూడో సిలిండర్‌కు రాయితీ వర్తిస్తుంది.
ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కో విడతకు సంబంధించిన రాయితీ మొత్తాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లిస్తోంది. లబ్ధిదారులు ముందుగా సిలిండర్‌కు సంబంధించిన మొత్తాన్ని చెల్లించి డెలివరీ తీసుకున్న తర్వాత రాయితీ సొమ్ము వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతోంది. అయితే ఈ మొత్తం ఏ తేదీన జమ అవుతుందనే విషయం ముందుగా తెలియకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారు రాయితీ ఏ ఖాతాలో జమైందో గుర్తించడం కూడా కష్టంగా మారుతోంది.
ప్రతిపాదిత విధానం అమల్లోకి వస్తే.. సెప్టెంబరులో సిలిండర్ తీసుకున్న అర్హులైన లబ్ధిదారులకు అక్టోబరులో నిర్ణయించిన తేదీన రాయితీ జమ చేయనున్నారు. అలాగే అక్టోబరులో సిలిండర్ తీసుకున్న వారికి నవంబరులో రాయితీ అందుతుంది. నెలలో ఏ తేదీన రాయితీ జమ చేయాలన్నది త్వరలో ఖరారు చేయనున్నారు.
అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి ఇతర నగదు బదిలీ పథకాల తరహాలోనే దీపం-2 రాయితీకి కూడా ముందుగానే నిర్ణీత తేదీని ప్రకటించే అవకాశం ఉంది. తద్వారా లబ్ధిదారులకు రాయితీ ఎప్పుడు అందుతుందనే దానిపై స్పష్టత ఏర్పడనుంది.
రాష్ట్రంలో మొత్తం 1.61 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో దీపం-1 కింద 58.42 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో 0.74 లక్షలు, సీఎస్‌ఆర్ కింద 6.24 లక్షలు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11.37 లక్షలు, ఇతర కేటగిరీల్లో 84.42 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అర్హులైన వారికి దీపం-2 కింద ఉచిత సిలిండర్లు అందిస్తున్నారు. ఒక్కో విడతలో సుమారు 92 లక్షల నుంచి కోటి వరకు సిలిండర్లు రాయితీపై అందుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















