రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన వంతెనల స్థానంలో కొత్త వంతెనలు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి నిధుల కొర్రీలు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రమాదకరంగా మారిన వంతెనలను గుర్తించి వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినా.. ఆర్థికశాఖ నుంచి వరుసగా అభ్యంతరాలు రావడంతో పనులు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
రాష్ట్రంలోని ఆర్‌అండ్‌బీ పరిధిలో 100 శిథిల వంతెనలను గుర్తించారు. ఇందులో రాష్ట్ర రహదారులపై 31, జిల్లా రహదారులపై 61, సీఎం పర్యటనల సందర్భంగా హామీ ఇచ్చిన మరో 8 వంతెనలు ఉన్నాయి. వీటి స్థానంలో కొత్త వంతెనలు నిర్మించేందుకు మొత్తం రూ.818 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
రాష్ట్ర రహదారులపై ఉన్న 31 వంతెనలు, సీఎం హామీ ఇచ్చిన 5 వంతెనలు కలిపి 36 వంతెనలకు రూ.372 కోట్లతో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటికి బడ్జెట్ నుంచి నిధులు సమకూర్చేందుకు ఆర్థికశాఖ తొలుత ప్రాథమికంగా అంగీకరించింది.
అయితే తాజాగా ఆయా వంతెనలకు వంతెనల వారీగా సమగ్ర అంచనాలు సమర్పించాలని ఆర్థికశాఖ కోరింది. పునర్నిర్మాణానికి భూసేకరణ అవసరమయ్యే ప్రాంతాలు, ఇతర సాంకేతిక అంశాలు, వ్యయ వివరాలను కూడా అందించాలని సూచించింది. దీంతో ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. మంజూరు ప్రక్రియ మళ్లీ మొదటి దశకు చేరినట్టయింది.
జిల్లా రహదారులపై ఉన్న 61 వంతెనలు, సీఎం హామీ ఇచ్చిన మరో 3 వంతెనలకు కలిపి రూ.446 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఈ పనులకు నిధులు సరిపోవని ఆర్థికశాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
దీంతో మొత్తం 100 వంతెనల్లో ఏవాటికి ఎప్పుడు నిధులు మంజూరవుతాయన్నది స్పష్టత లేకుండా పోయింది. తాజాగా 36 వంతెనలకు కూడా సమగ్ర అంచనాలు కోరడంతో నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉందని ఆర్‌అండ్‌బీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు తారు ధరలు పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారి పనుల వేగం తగ్గింది. రూ.40 లక్షలకు పైగా అంచనా వ్యయంతో చేపట్టిన పనులకు పెరిగిన తారు ధరలకు అనుగుణంగా చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
అయితే రూ.40 లక్షలలోపు పనులకు మాత్రం ఆ సౌకర్యం లేకపోవడంతో చిన్న కాంట్రాక్టర్లు పనులు చేపట్టడంలో ఆసక్తి చూపడం లేదు. తారు ధరలు తగ్గిన తర్వాత పనులు చేపట్టాలని కొందరు భావిస్తున్నారు. చిన్న పనులకు కూడా పెరిగిన ధరల మేరకు చెల్లింపులు చేసేలా వెసులుబాటు కల్పించాలని ఆర్‌అండ్‌బీ శాఖ పంపిన ప్రతిపాదనపై ఆర్థికశాఖలో నిర్ణయం ఆలస్యమవుతోంది.
నెల్లూరు నుంచి అనుమసముద్రంపేట వెళ్లే మార్గంలోని నక్కలవాగు వంతెన పరిస్థితి ప్రమాదకరంగా మారింది. సుమారు ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెనకు పలు చోట్ల పగుళ్లు ఏర్పడి శిథిలావస్థకు చేరింది.
నాలుగేళ్ల క్రితం వంతెన గోడలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడటంతో ఆర్‌అండ్‌బీ అధికారులు కింద ఇనుప గడ్డర్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇసుక, ధాన్యం, సిమెంటు వంటి భారీ లోడ్లతో వాహనాలు నిత్యం ఈ వంతెనపై రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో వంతెనపై ప్రయాణించాలంటేనే స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















