మొక్కలంటే వెంటనే నాటేయొచ్చు.. నర్సరీ నుంచి తెచ్చుకుని ఇంట్లో పెంచుకోవచ్చు అనుకుంటాం. కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొక్కల విషయంలో మాత్రం అలా కాదు. వాటిని నర్సరీకి తీసుకొచ్చిన వెంటనే విక్రయించేందుకు అనుమతి ఉండదు. ముందుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ప్లాంట్ క్వారంటైన్ సెంటర్’లో కనీసం 45 రోజులపాటు ఉంచాల్సిందే. చీడపీడలు, తెగుళ్లు లేవని నిర్ధారించిన తర్వాతే వాటిని విక్రయానికి అనుమతిస్తారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం పరిసరాల్లో వందల సంఖ్యలో నర్సరీలు ఉన్నాయి. వీటిలో అంతర్జాతీయ స్థాయిలో మొక్కలను దిగుమతి చేసుకునేందుకు లైసెన్స్ ఉన్న నర్సరీలు సుమారు పది వరకు ఉన్నాయి. చైనా, స్పెయిన్, మలేసియా, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం తదితర దేశాల నుంచి దాదాపు 50 రకాల మొక్కలను ఇక్కడికి దిగుమతి చేస్తుంటారు. అరుదైన మొక్కలతో పాటు వందల ఏళ్ల వయసున్న వృక్షాలను కూడా తీసుకొచ్చి స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పెంచుతారు.
చైనా నుంచి సైకస్, స్పెయిన్ నుంచి ఆలివ్, ఆర్నమెంటల్, వివిధ పామ్ రకాలు, స్విట్జర్లాండ్ నుంచి పుష్పించే మొక్కలు, ఇండోర్ ప్లాంట్లలోని ప్రత్యేక పుష్ప రకాలను దిగుమతి చేస్తుంటారు. వీటిని దేశీయ మొక్కలతో మల్టిపుల్ చేసి స్థానికంగా ఉత్పత్తి చేస్తారు. అనంతరం వాటిని పెంచి విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్ది మార్కెట్‌కు సిద్ధం చేస్తారు. దీంతో కడియం నర్సరీలకు దేశీయంగానే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ మంచి గుర్తింపు వచ్చింది.
విదేశాల నుంచి మొక్కలను దిగుమతి చేసుకోవడం అంత సులభమైన ప్రక్రియ కాదు. ఏ దేశం నుంచి ఏ రకమైన మొక్కలను తీసుకురావాలనుకుంటున్నారో ముందుగానే సంబంధిత కస్టమ్స్ అధికారులకు జాబితా అందించాలి. అధికారులు ఆమోదించిన మొక్కలను మాత్రమే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఒక కంటెయినర్ బుక్ చేసుకునే సమయంలోనే కనీసం రూ.25 లక్షల వరకు కాషన్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు.
ఇండోర్, అవుట్‌డోర్, ఫ్లవరింగ్ మొక్కలతో పాటు ఏళ్ల వయసున్న వృక్షాలను కూడా సముద్ర మార్గంలో ప్రత్యేక ఏసీ కంటెయినర్లలో తరలిస్తారు. ఇవి సాధారణంగా చెన్నై, ముంబయి వంటి ప్రధాన నౌకాశ్రయాలకు చేరుతాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కడియం నర్సరీలకు తీసుకొస్తారు. మొక్కలు నర్సరీలకు చేరిన వెంటనే వాటిని విక్రయించకుండా నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు.
నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ క్వారంటైన్ సెంటర్లలో మొక్కలను కనీసం 45 రోజులపాటు ఉంచుతారు. ఇండోర్, అవుట్‌డోర్ మొక్కలకు వేర్వేరు క్వారంటైన్ ఏర్పాట్లు ఉంటాయి. ఈ సమయంలో మొక్కల ఆరోగ్య పరిస్థితి, చీడపీడలు, తెగుళ్ల ప్రభావం తదితర అంశాలను పరిశీలిస్తారు.
క్వారంటైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత అధికారులు మొక్కలను సమగ్రంగా పరిశీలిస్తారు. ఎలాంటి చీడపీడలు, వ్యాధులు లేవని నిర్ధారించిన అనంతరం వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. మొక్క ఉన్న ప్రదేశాన్ని ఫొటోలతో సహా మ్యాపింగ్ చేస్తారు. అన్ని నిబంధనలు పూర్తయి, అధికారులు అనుమతి ఇచ్చిన తర్వాతే వాటిని విక్రయానికి తీసుకువస్తారు.
నర్సరీల్లో కనిపించే అరుదైన విదేశీ మొక్కలు, ప్రత్యేక ఆకృతుల్లో కనిపించే వృక్షాల వెనుక సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. విదేశీ నేల నుంచి కడియం వరకు వాటి ప్రయాణం.. ఆ తర్వాత 45 రోజుల క్వారంటైన్.. అధికారుల తనిఖీలు.. మ్యాపింగ్.. ఇలా అన్ని దశలు పూర్తయిన తర్వాతే అవి మన ఇళ్లను, తోటలను అలంకరించేందుకు సిద్ధమవుతాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















