“అయ్యయ్యో… రైలు వస్తోంది! త్వరగా పెట్టెలు, బట్టల సంచులు పట్టుకోండి… త్వరగా బయలుదేరండి!” అని నాన్న గట్టిగా పిలుస్తూ లోపలికి వచ్చాడు.
ఆ మాట విన్న వెంటనే ఇంట్లో అంతా గందరగోళం మొదలైంది. నేను, నానమ్మ, తాతయ్య, అమ్మ, చెల్లి — అందరం ఏదో పట్నానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాం. స్టేషన్‌కి చేరుకున్నాం. రైలు వస్తుందని ప్రకటించగానే ఒక ప్లాట్‌ఫారం నుంచి ఇంకో ప్లాట్‌ఫారంకి అందరం పరిగెత్తసాగాం. ఎవరికి ఏమి అర్థం కాకుండా పరుగులు. ఆ కల్లోలంలో ఎప్పుడో రైలు వచ్చి నిలిచి, మళ్లీ కదిలిపోయింది. కానీ నాకు మాత్రం రైలు వచ్చినట్టు కూడా తెలియలేదు. చూసేసరికి అమ్మ, నాన్న, చెల్లి, నానమ్మ, తాతయ్య అందరూ రైలెక్కి వెళ్లిపోయారు.
నేను మాత్రం అక్కడే మిగిలిపోయాను…
నా చేతిలో ఒక చిన్న పిల్లాడు. నా పక్కనే ఇంకో చిన్న పిల్లాడు నాతో పాటు పరిగెడుతున్నాడు. రైలును అందుకోవాలని పట్టాల వెంట పరుగెత్తాను. ఎంత పరిగెత్తినా రైలు వేగాన్ని అందుకోలేకపోయాను. రైలు దూరమైపోయింది…అలా పట్టాల వెంట నడుస్తూ, నడుస్తూ ఎక్కడో ఒక ఊరికి చేరుకున్నాను.
ఆ ఊరు నిర్మానుష్యంగా ఉంది. ఎవరూ కనిపించలేదు. సహాయం అడగడానికి ఒక్క మనిషి కూడా లేడు. చేతిలో ఉన్న పిల్లాడు బరువెక్కిపోతున్నాడు. నాతో నడుస్తున్న పిల్లాడి కాళ్లు నొప్పితో బాధపడుతున్నాయి. “అమ్మా…” అని అతను అలసటగా పిలుస్తున్నాడు. ఆ మాట విన్న ప్రతిసారి నా గుండె నిండా ఒక విచిత్రమైన బాధ అలుముకుంది. కొంత దూరం నడిచాక ఒక పెద్ద పార్క్ కనిపించింది. పార్క్‌లో ఎన్నో రకాల పూల చెట్లు, చిన్న చిన్న దారులు కనిపిస్తున్నాయి. ఏ దారి వెళ్తే బయటకు చేరుకుంటానో అర్థం కాలేదు. కొంతసేపు తిరుగుతూ వెళ్లగా ఒక చిన్న కొళాయి కనిపించింది. అక్కడ ఆగి నీళ్లు తాగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాం.
మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాను.
రాత్రి మరింత చీకటిగా మారింది. చుట్టూ ఏమీ కనిపించట్లేదు. నాకు రెచ్చికటేమో అనిపించింది. వెన్నెల వెలుగు మాత్రమే మా దారికి తోడుగా ఉంది.అప్పుడే ఎదురుగా ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. నా నడుమంత ఎత్తులో ఒక చిన్న గుండ్రటి రైలు నా వైపు వస్తోంది. నేను దారి మధ్య నిలబడగానే అది గట్టిగా హారన్ మోగించింది. “తప్పుకో… తప్పుకో…” అన్నట్టుగా.ఆ రైలు బొమ్మల రైలు లాగా అటూ ఇటూ మలుపులు తిరుగుతూ నా కాలిని తాకకుండా దాటిపోయింది. నేను కొంచెం పక్కకు జరగగానే ఇంకో రైలు వచ్చింది. ఈసారి నేను రెండు రైళ్ల మధ్య నిలబడ్డాను. అవి రెండూ నా మోకాళ్లంత ఎత్తులో ఉండి, వేగంగా నన్ను దాటుకుని వెళ్లిపోయాయి.
ఆ రైళ్లు వెళ్లిపోయాక మళ్లీ నా నడక ప్రారంభించాను.కొంత దూరం వెళ్లగానే నా స్నేహితురాలు కనిపించింది. ఆమెను చూసి నాకు ఎంత ఉపశమనం కలిగిందో! వెంటనే నా కథ మొత్తం చెప్పాను — రైలు తప్పిపోయిన సంగతి, పిల్లలతో అలా తిరుగుతున్న సంగతి. ఆమె సానుభూతిగా నవ్వి, “ఏమీలేదు… కొంతసేపు మా ఇంట్లో ఉండు. తర్వాత ఎలా వెళ్లాలో చూస్తాం,” అంది.
ఆమె ఇంటికి వెళ్లాం.
అది రెండంతస్తుల భవనం. రెండో అంతస్తు నిండా వివిధ రకాల ధాన్యపు సంచులు ఉన్నాయి. నా స్నేహితురాలు ముందు పట్నంలో ఉండేదట. కానీ వ్యవసాయం మీద ప్రేమతో పల్లెలోకి వచ్చి రైతుగా జీవిస్తోంది. ఆమె భర్త మాత్రం పట్నంలో ఉండాలని అనుకునే వాడు. వ్యవసాయం చేస్తూ బాగా అలసిపోయినట్టుగా కనిపించాడు.
అతని మోచేతికి, కాలికి కట్టు ఉంది.
ఏమైంది అన్నయ్య?” అని అడిగాను. అతను నవ్వుతూ, “రెండో అంతస్తుకు మోటార్ సైకిల్ ఎక్కిస్తూ ఉండగా జారి పడిపోయాను,” అన్నాడు. ఆ మోటార్ సైకిల్ మీద కూడా ధాన్యం సంచులు ఉన్నాయి. కొంతసేపటి తర్వాత నా ఫోన్‌లో చార్జ్ లేదని గుర్తొచ్చింది. నన్ను తీసుకెళ్లడానికి మా ఆయన రావాలి కదా అని ఫోన్ చేయాలని అనుకున్నాను. నా స్నేహితురాలి ఫోన్ తీసుకుని కాల్ చేశాను. “నువ్వు ఒక స్థలంలో ఉండు… నేను వచ్చి తీసుకెళ్తాను,” అని ఆయన చెప్పారు. సరే అని చెప్పి ఇద్దరు పిల్లలతో బయలుదేరాను. మధ్యలో ఒక పెద్ద గుహ కనిపించింది. ఆ గుహలో నుంచి మళ్లీ ఒక చిన్న రైలు బయటకు వస్తోంది. అది కూడా నా నడుమంత ఎత్తులోనే ఉంది.
“ఇక్కడికే వస్తాడా? రాడా? అని సందేహంతో నాలుగు అడుగులు ముందుకు వేసాను. అప్పుడే గుర్తొచ్చింది — ఫోన్ స్నేహితురాలి ఇంట్లోనే మర్చిపోయాను.
వెనక్కి వెళ్లాలనిపించలేదు. ఒంట్లో బలహీనత. నడవడానికి కూడా శక్తి లేదు. అలా నడుస్తూ ఉండగా ఎవరో నా భుజంపై చేయి వేసి నన్ను లేపుతున్నారు. కళ్లుతెరిచి చూసేసరికి — మా నాన్న! మేమంతా ఎడ్లబండిలో ఏదో జాతరకి వెళ్లి వస్తున్నాం.
నేను బండి దిగాను. నా వెంట చెల్లి, తాతయ్య, నానమ్మ, అమ్మ కూడా దిగారు. నాన్న నన్ను చూస్తూ పదే పదే నవ్వుతున్నారు. “ఏమైంది నాన్న?” అని అడిగాను.
ఆయన నవ్వుతూ చెప్పారు: “నువ్వు బండిలో పడుకుని పదే పదే ‘నా కళ్ళు కనబడడం లేదు… నా కళ్ళు కనబడడం లేదు…’ అని కలవరించుకుంటూ ఉన్నావు!” ఆ మాట విన్నాక ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాను. ఇంతసేపు రైలు తప్పిపోవడం… పిల్లలతో తిరగడం… స్నేహితురాలిని కలవడం… ఇవన్నీ కలేనా? అలా అనుకుంటూ పక్కకు చూసాను. అక్కడ ఓ ఇరవై ఐదు సంవత్సరాల కుర్రవాడు నిలబడి నన్నే చూస్తున్నాడు.
“నా కోసమే ఎదురు చూస్తున్నాడేమో…” అనిపించింది. అలా ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్లాను.
అప్పుడు ఒక్కసారిగా గమనించాను — నా చుట్టూ పిల్లలు ఎవరూ లేరు. అసలు నాకు ఇంకా పెళ్లే కాలేదు! నేను ఇంకా పాతికేళ్ల యువతినే!అంటే… ఇప్పటివరకు జరిగినదంతా కలేనా? ఇలా ఆలోచిస్తూ ఉండగా… ఐదు నిమిషాల తర్వాత ఎవరో నా భుజం తట్టి లేపుతున్నారు.
“ఏమిటి ఇంకా లేవలేదు? సమయం ఆరు అయ్యింది!” అని మా వారు అంటున్నారు. నేను ఒక్కసారిగా లేచాను.
అంటే… ఇప్పుడే జరిగిన రైలు ప్రయాణం… స్నేహితురాలి ఇల్లు… ఎడ్లబండి… నాన్న మాటలు…
ఇవన్నీ కూడా కలేనా?
అంటే…
కలలో నాకు మరో కల…
ఆ కలలో మళ్లీ ఇంకో కల! అని ఆశ్చర్యపోయాను !!
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















