కొన్ని కోర్సులు, ఉద్యోగాలకు పలు సబ్జెక్టుల్లో నైపుణ్యం తప్పనిసరి. ముఖ్యంగా మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఫైనాన్స్, అకౌంట్స్‌లపై పట్టున్నవారు ఎంచుకోవడానికి ముఖ్యమైన కోర్సులు, వృత్తులు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఏదైనా పూర్తిచేస్తే బహుళ జాతి సంస్థల్లో ఆకర్షణీయ వేతనంతో రాణించవచ్చు.
ఫలానా షేరు కొంటే లాభాలు గ్యారంటీ అని చెప్పడానికి కారణాలు వివరించాలి, పెట్టుబడులు మంచి ఫలాలను అందించడానికి ఏం చేయాలో విశ్లేషించాలి, కంపెనీ పద్దు పుస్తకం వివరంగా ఉండాలి, ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలో ప్రామాణికంగా చెప్పగలగాలి. సంస్థలు ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవచ్చు, లాభాలను ఎలా పెంచుకోవచ్చో ఆచరణీయాత్మకంగా సూచించగలగాలి. ఇలాంటి విషయాలన్నీ శాస్త్రీయంగా చెప్పడానికి కొన్ని హోదాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, కోర్సులు ఉన్నాయి. వీటిలో ఏది ఎంచుకున్నప్పటికీ అంకెలపై పట్టు, తర్కం, విశ్లేషణ, సునిశిత పరిశీలన, ఇతర అంశాలపై అవగాహన, మార్కెట్ పోకడలు తెలిసుండాలి.
కార్పొరేట్ ఫైనాన్స్
ఉన్న డబ్బును ప్రణాళికతో ఖర్చుచేయడమే కార్పొరేట్ ఫైనాన్స్. బడ్జెట్ ప్రకారం ఆర్థిక వనరులను సవ్యంగా ఉపయోగించాలి. సంస్థలు అంతర్గత ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కార్పొరేట్ ఫైనాన్స్ నిపుణులను నియమించుకుంటాయి. డబ్బు వృథా కాకుండా చూడడం వీరి ప్రధాన విధి. ఆపరేషన్ వ్యయాలు ఎలా తగ్గించుకోవచ్చో సంస్థలకు సూచిస్తారు. పెట్టుబడులపై వస్తోన్న ఫలితాలను సమీక్షిస్తారు. డబ్బుని స్మార్ట్‌గా వినియోగించడంలో నైపుణ్యం, ఆసక్తి ఉంటే కార్పొరేట్ ఫైనాన్స్‌ను కెరియర్‌గా స్వీకరించవచ్చు.
ఎవరికి బాగు: ఫైనాన్స్ నేపథ్యంతో డిగ్రీ లేదా ఎంబీఏ ఫైనాన్స్ వారు ఇందులో రాణించవచ్చు. పెద్ద కార్పొరేట్ సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల్లో వీరికి అవకాశాలు లభిస్తాయి. విశ్లేషణాత్మక పరిశీలన, మార్కెట్‌పై అవగాహన ఉండాలి.
ఫైనాన్షియల్ ప్లానింగ్
ఆర్థిక ప్రణాళికల్లో మీరు పక్కాగా వ్యవహరించగలరా? అయితే ఫైనాన్షియల్ ప్లానింగ్‌వైపు మీరు దృష్టి సారించవచ్చు. సంస్థలు, వ్యక్తులు డబ్బును ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా ఉపయోగించవచ్చో వీరు వివరిస్తారు. ఎందులో పెట్టుబడులు పెట్టాలి, ఎంత వరకు రిస్క్ తీసుకోవచ్చు, భవిష్యత్తు అవసరాలు తీరడానికి ఇప్పుడున్నదాన్ని వైవిధ్యంగా ఎలా ఉపయోగించాలి.. మొదలైనవి వీరు విశ్లేషించి, సూచనలు చేస్తారు. వినియోగదారుల పెట్టుబడులను సమీక్షిస్తారు. పన్ను తగ్గించుకోవడానికి అవకాశమున్న మార్గాలను వివరిస్తారు. ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌లో పట్టున్నవారు రాణించగలరు.
విద్యా నేపథ్యం: యూజీ స్థాయిలో కామర్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు చదివినవారు ఫైనాన్షియల్ ప్లానర్ కావడానికి ప్రయత్నించవచ్చు. ఈ సబ్జెక్టుల్లో పీజీ ఉంటే మంచిది. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (సీఎఫ్‌పీ) గుర్తింపు పొందినవారు కార్పొరేట్, ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థల్లో రాణించగలరు.
పబ్లిక్ అకౌంటింగ్
సంస్థలోకి వస్తున్న, సంస్థ నుంచి వెళ్తోన్న డబ్బుల వివరాలు పకడ్బందీగా రికార్డులకు ఎక్కించడం పబ్లిక్ అకౌంటింగ్ నిపుణుల బాధ్యత. ఖర్చులు తగ్గించుకుని, రెవెన్యూ మార్గాలను పెంచుకోవడానికి వీరు సంస్థలకు సూచనలూ అందిస్తారు. ఇంటర్నల్ ఆడిటింగ్ విధులూ నిర్వర్తిస్తారు. సంస్థ పెట్టుబడులు, ఖర్చులు ఎంత వరకు ఫలవంతమవుతున్నాయి, భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి ఏ మేరకు ఉపయోగపడగలవో విశ్లేషిస్తారు.
విద్యా నేపథ్యం: బీకామ్, ఎంకామ్ కోర్సులు పూర్తిచేసుకున్నవారు పబ్లిక్ అకౌంటింగ్ వైపు దృష్టి సారించవచ్చు. సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (సీపీఏ) గుర్తింపు పొందినవాళ్లు ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఎంబీఏ ఫైనాన్స్‌తోపాటు సర్టిఫికేషన్ ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కార్పొరేట్ సంస్థలు, అకౌంటింగ్ సంస్థల్లో పబ్లిక్ అకౌంటింగ్ నిపుణులకు ఉద్యోగాలు ఉంటాయి. అంకెలపై పని చేయడాన్ని ఆస్వాదించేవారు పబ్లిక్ అకౌంటింగ్‌కి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్
ఫైనాన్స్ విభాగంలో అత్యంత విలువైనదిగా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌ని చెప్పుకోవచ్చు. సంస్థలకు సంబంధించిన రోజువారీ ఆర్థిక కార్యకలాపాలకు ఒక కొత్త రూపాన్ని తీసుకురావడంలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల పాత్ర ఉంటుంది. సవాళ్లను స్వీకరించడానికి ఇష్టపడేవారు, డేటా, నంబర్లలో ట్రెండ్‌ని గుర్తించగలిగేవాళ్లు, కాలిక్యులేషన్లు ఇష్టపడేవాళ్లు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కెరియర్‌గా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇందులో రాణించడానికి ఎక్కువ సమయం వెచ్చించడం తప్పనిసరి. కొత్తగా చేరినవారు, ప్రారంభస్థాయి ఉద్యోగులైతే మరింత కష్టపడాలి. గోల్డ్‌మెన్ శాక్స్ లాంటి సంస్థలు పేరున్న బిజినెస్ స్కూళ్ల విద్యార్థులను ఇందుకోసం నియమించుకుంటున్నాయి. కార్పొరేట్ సంస్థలకు వీరు ఆర్థిక సలహాదారులుగానూ వ్యవహరిస్తారు. విశ్లేషణాత్మక ఆలోచనాపరులు, కమ్యూనికేషన్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉన్నవారు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ వైపు మొగ్గు చూపవచ్చు.
ఎవరికి బాగు: ఫైనాన్స్, కామర్స్, ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మంచిది. పేరున్న సంస్థల్లో ఎంబీఏ ఫైనాన్స్ స్పెషలైజేషన్ పూర్తిచేసుకున్నవారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్
కామర్స్, సైన్స్ రెండిటి మేలవింపే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్. మంచి పోర్ట్‌ఫోలియో మేనేజర్ కావడానికి ఈ రెండు సబ్జెక్టులపై పట్టు తప్పనిసరి. కంపెనీ లేదా క్లయింట్ పెట్టుబడుల వైవిధ్యాన్ని పోర్ట్ ఫోలియో నిపుణులు నిర్ణయిస్తారు. ఏ రంగాలకు ఎంత కేటాయించాలి, అలా ఎందుకో స్పష్టమైన కారణాలను అందిస్తారు. అవకాశాలు అన్వేషించడం, బలాలు, బలహీనతలు విశ్లేషించుకుని ముందుకెళ్లడం, స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న అవరోధాలను గమనించడం వీరి విధుల్లో భాగం. రిస్క్ తీసుకుంటూనే వీలైనంత లాభాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తారు. సిప్‌లు, పలు రకాల బీమా పాలసీల ఆవిష్కరణ, నడిపించడంలో పోర్ట్‌ఫోలియో మేనేజర్ల సేవలే కీలకం.
ఎవరికి బాగు: గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఫైనాన్స్, అకౌంటింగ్, ఎకనామిక్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లపై పట్టుండాలి. హై లెవెల్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ కోర్సులు చదివినవారు, యాక్చూరియల్ సైన్స్ కోర్సు పూర్తిచేసుకున్నవారు పోర్ట్‌ఫోలియో మేనేజర్లుగా రాణించగలరు. విఖ్యాత సంస్థల్లో ఎకనామిక్స్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ చదివినవారికీ ప్రాధాన్యముంటుంది.
స్టాక్ బ్రోకింగ్
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ లాంటిదే ఇది. ఫైనాన్స్‌లో పట్టున్నవారికి స్టాక్ బ్రోకింగ్ లాభదాయకమైన, గౌరవమైన వృత్తిగా చెప్పుకోవచ్చు. కంపెనీల స్టాక్‌లు, షేర్లను అమ్మడం, కొనడం ద్వారా కొంత మొత్తాన్ని సంపాదించడమే స్టాక్ బ్రోకింగ్ లక్ష్యం. ఏ షేర్లను కొనాలి, వాటిని ఎప్పుడు అమ్మాలి, కొనుగోలుకు, అమ్మకానికి ఏది అత్యుత్తమ సమయం లాంటివన్నీ వీరు వివిధ ప్రామాణికాల ఆధారంగా నిర్ణయించి, క్లయింట్లకు సూచిస్తారు. ఇందుకోసం సంస్థల ఉత్పత్తుల్లో నాణ్యత, వాటి తాజా నిర్ణయాలు, ఆ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్, కంపెనీల భవిష్యత్తు లక్ష్యాలు,
ఆ రంగంలో ఉన్న పోటీ.. ఇలా పలు కోణాల్లో సమాచారం సేకరించి ఆ షేర్లపై ఒక అంచనాకు వస్తారు. అనలిటికల్, స్టాటిస్టికల్ స్కిల్స్, స్టాక్ మార్కెట్‌పై అవగాహన తప్పనిసరి.
ఎవరికి బాగు: స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫైనాన్స్ నేపథ్యం ఉన్నవారు స్టాక్ బ్రోకింగ్‌లో రాణించవచ్చు. స్టాక్ బ్రోకింగ్, స్టాక్ అనాలిసిస్, స్టాక్ మార్కెట్ రిసెర్చ్‌కు సంబంధించి షార్ట్ టర్మ్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) అందించే కోర్సుల్లో చేరి ప్రావీణ్యం పొందవచ్చు.
రిస్క్ మేనేజ్‌మెంట్
సంస్థలు ఆర్థిక ఫలాలు పొందడానికి పెట్టుబడులు పెంచుకోవడం తప్పనిసరి. అయితే అనుకోని నష్టాలను తగ్గించుకోవడానికి స్ట్రాటజీ ఉండాలి. ఈ పనిని చేసేవారే రిస్క్ మేనేజర్లు. వీరు సంస్థలకు కన్సల్టెంట్లగానూ విధులు నిర్వర్తిస్తారు. పెట్టుబడులు ఎంతవరకు సురక్షితం, నష్టాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి.. మొదలైనవి సూచిస్తారు. విజన్, మిషన్‌తో కూడిన బిజినెస్ మోడల్‌ను కంపెనీలకు అందిస్తారు. ఇందుకోసం గణితం, తర్క నైపుణ్యం అవసరం.
విద్యా నేపథ్యం: మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టుల్లో గట్టి పట్టున్నవారు రిస్క్ మేనేజ్‌మెంట్‌లో రాణించవచ్చు. రిస్క్ మేనేజ్‌మెంట్ కోర్సులు సైతం ఉన్నాయి. ఎంబీఏలో స్పెషలైజేషన్‌గా, పీజీ డిప్లొమా కోర్సుగా దీన్ని అందిస్తున్నారు. ఐఐఆర్‌ఎంతో పాటు మరికొన్ని సంస్థలు ఈ కోర్సుల్లో పేరొందాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















