ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థ (ఆర్టీసీ) తన పాత, ఎక్కువ కిలోమీటర్లు నడిచిన బస్సుల స్థానంలో పర్యావరణ హితమైన విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దశలవారీగా మొత్తం 6,000 బస్సులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో 5,500 విద్యుత్ బస్సులు, 500 సీఎన్‌జీ బస్సులు ఉండనున్నాయి.
పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సిటీ సర్వీసులలో కాలం చెల్లిన బస్సులను గుర్తించి వాటి స్థానంలో అదే రకాల సర్వీసులుగా విద్యుత్ బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. ప్రయాణికులకు సేవల్లో ఎటువంటి మార్పు లేకుండా, ప్రస్తుత రూట్లలోనే ఈ బస్సులు కొనసాగుతాయని ఆర్టీసీ స్పష్టం చేసింది.
ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద రాష్ట్రానికి ఇప్పటికే 750 విద్యుత్ బస్సులు కేటాయించబడ్డాయి. వీటిని 11 నగరాల్లోని 12 డిపోల పరిధిలో అద్దె ప్రాతిపదికన నిర్వహించనున్నారు. ఇందులో మొదటి దశగా 300 బస్సులు జులైలో రోడ్డెక్కనుండగా, మిగిలిన 450 బస్సులు ఆగస్టులో అందుబాటులోకి రానున్నాయి.
అదేవిధంగా తిరుమల ఘాట్ మార్గంలో డీజిల్ బస్సుల స్థానంలో నడపడానికి కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ 300 ప్రత్యేక విద్యుత్ బస్సులను మంజూరు చేసింది. ఇతర నగరాల్లో నడిచే బస్సులు 12 మీటర్ల పొడవుతో ఉండగా, ఘాట్ రూట్ కోసం 9 మీటర్ల పొడవు గల బస్సులను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. వీటి కోసం టెండర్ల ప్రక్రియ కేంద్ర స్థాయిలో కొనసాగుతోంది.
గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) విధానంలో మరో 1,450 విద్యుత్ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోనుంది. ఇందుకు సంబంధించిన ఆసక్తి వ్యక్తీకరణ (EOI) ఇప్పటికే సిద్ధమవగా, జులై నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ బస్సులను దశలవారీగా రోడ్డెక్కించేందుకు ప్రణాళిక రూపొందించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పూర్వోదయ పథకం కింద వివిధ రాష్ట్రాలకు విద్యుత్ బస్సులు కేటాయిస్తుండగా, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 1,000 బస్సులు లభించనున్నాయి. అలాగే గ్రామీణ, కొంత దూర ప్రాంతాల అవసరాల కోసం పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మరో 2,000 బస్సుల ప్రతిపాదన కేంద్రానికి పంపబడింది.
ఇక సీఎన్‌జీ అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 500 సీఎన్‌జీ బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఇందుకోసం సీఎన్‌జీ సరఫరా సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం నడుస్తున్న పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి బస్సుల రంగు, రూపంలో ఎటువంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు. విద్యుత్ బస్సులు కూడా అదే రంగుల్లో ఉండటంతో ప్రయాణికులకు ఎలాంటి గందరగోళం కలగదని వారు స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















