సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో చోటుచేసుకున్న యువకుడి హత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపుతోంది. జవహర్‌నగర్‌కు చెందిన యావన్ (23) అనే బీటెక్ విద్యార్థిని అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చడం నగరవ్యాప్తంగా సంచలనంగా మారింది.
సమాచారం ప్రకారం.. యావన్ సీతాఫల్‌మండికి చెందిన ఓ యువతిని గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో పలుమార్లు హెచ్చరించినప్పటికీ.. అతను ఆమెను కలుస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇందిరానగర్‌లోని స్నేహితుడి ఇంట్లో ఉంటున్న యావన్‌పై గురువారం రాత్రి ఆరుగురు వ్యక్తులు మూడు బైక్‌లపై వచ్చి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఆ సమయంలో యావన్ స్నేహితులతో కలిసి టీవీ చూస్తుండగా.. ఒక్కసారిగా కత్తులతో దాడి చేసిన దుండగుల నుంచి తప్పించుకునేందుకు బయటకు పరుగెత్తినా వారు వెంటాడి విచక్షణారహితంగా పొడిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన యావన్‌ను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు చిలకలగూడ ప్రధాన రోడ్డుపై మృతదేహంతో బైఠాయించి నిరసన చేపట్టారు. యావన్‌ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్ద సంఖ్యలో యువకులు యువతి ఇంటివైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సంఘటన స్థలానికి అదనపు బలగాలను మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా? లేక మరేదైనా కోణం ఉందా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్, స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















