గోదావరి పుష్కరాలను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ చర్యలు ముమ్మరం చేసింది. ఆగస్టు 15 నుంచి నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి నిషేధం అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలను కఠినతరం చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడంతోపాటు ప్రజలకు ప్రత్యామ్నాయ వస్తువులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
సుమారు 4.5 లక్షల జనాభా ఉన్న రాజమహేంద్రవరంలో రోజుకు దాదాపు ఐదు మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో సుమారు రెండు టన్నుల వ్యర్థాలే రీసైక్లింగ్‌కు ఉపయోగపడుతున్నాయి. మిగిలిన వ్యర్థాల్లో అధిక భాగం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కావడంతో పారిశుద్ధ్య నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నగరంలోని కాలువల్లో పూడిక తొలగించే సమయంలో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఆవ, నల్లాచానళ్ల పరిసరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు కాలువల్లో పేరుకుపోవడంతో వర్షాకాలంలో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.
నగర పరిధిలో రోజూ సుమారు 45 ఎంఎల్‌డీ వ్యర్థజలాలు గోదావరిలో కలుస్తున్న నేపథ్యంలో నదీ కాలుష్య నియంత్రణపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతంలో నిర్వహించిన అధ్యయనాల్లో గోదావరి జలాల్లో సాధారణ స్థాయికంటే అధికంగా ఈకోలీ, ఇతర బ్యాక్టీరియాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడం మరింత కీలకంగా మారింది.
ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు నగర పరిధిలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎంహెచ్‌వో పర్యవేక్షణలో పనిచేసే ఒక్కో బృందంలో ఇద్దరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఒక మహిళా పోలీసు ఉంటారు. దుకాణాలు, వ్యాపార సంస్థలను తనిఖీ చేసి నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగాన్ని గుర్తిస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించనున్నారు. చర్యల పురోగతిని ప్రతి బుధవారం సమీక్షించనున్నారు.
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించగల వస్తువులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రైతు బజార్లు, ప్రధాన కూడళ్లు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మెప్మా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ఉత్పత్తులు, వాటిని ఎక్కడ కొనుగోలు చేయవచ్చనే వివరాలను తెలియజేస్తారు. వివిధ ప్రత్యామ్నాయ వస్తువులతో ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయనున్నారు.
ప్లాస్టిక్ బాటిళ్లను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా దాతల సహకారంతో నగరంలోని 22 ప్రాంతాల్లో బాటిల్ సేకరణ పాయింట్లను ఏర్పాటు చేశారు. వీటి సంఖ్యను మరో 15 వరకు పెంచేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సేకరించిన బాటిళ్లను క్రమబద్ధంగా తరలించి రీసైక్లింగ్‌కు పంపేలా చర్యలు తీసుకోనున్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయం, వినియోగాన్ని నిరోధించేందుకు జరిమానాలను కూడా క్రమబద్ధీకరించారు. సాధారణ దుకాణాలకు తొలిసారి రూ.500, మధ్యస్థాయి దుకాణాలకు రూ.1,000, పెద్ద దుకాణాలకు రూ.3,000 వరకు జరిమానా విధించనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ మళ్లీ పట్టుబడితే జరిమానాను రెట్టింపు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.
ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు వ్యాపారులకు ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై వివరాలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని నగరపాలక సంస్థ కోరుతోంది.
‘‘ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగాన్ని వివరిస్తాం. వాటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం. స్వచ్ఛ రాజమహేంద్రవరం సాధనకు వ్యాపారులు, ప్రజలు సహకరించాలి’’ అని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















