విజయనగరం జిల్లాలో పోలీస్ వాహనం ప్రమాదానికి గురైంది. బ్రేకులు విఫలమవడంతో అదుపుతప్పిన వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా.. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, డ్రైవర్ గాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదం పోలీసు శాఖలో విషాదం నింపింది.
ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం.. కేసు దర్యాప్తులో భాగంగా విజయనగరం గ్రామీణ ఎస్సై అశోక్‌కుమార్, డ్రైవర్ రాజాబాబు, కానిస్టేబుల్ శీర వెంకటరమణ, హెచ్‌సీ నాగేంద్రప్రసాద్ మండలంలోని కొండకరకం వెళ్లారు. అక్కడ దర్యాప్తు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా గాజులరేగ ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో పోలీస్ వాహనం బ్రేకులు విఫలమయ్యాయి.
దీంతో డ్రైవర్ వాహనాన్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వాహనం వేగంగా వెళ్లి రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనంలో ఉన్న నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే క్షతగాత్రులను మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తలకు తీవ్ర గాయాలు కావడంతో కానిస్టేబుల్ శీర వెంకటరమణ (49) చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఎస్సై అశోక్‌కుమార్‌కు ఎడమ కాలు, హెడ్ కానిస్టేబుల్ నాగేంద్రప్రసాద్‌కు ఎడమ చెయ్యి విరిగింది. డ్రైవర్ రాజాబాబుకు నడుము వద్ద గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడిన ముగ్గురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంలో గాయపడిన పోలీసులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. కానిస్టేబుల్ వెంకటరమణ మృతి బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటరమణ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు ఘటనపై హోం మంత్రి అనిత ఎస్పీ ఏఆర్ దామోదర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన పోలీసుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
కానిస్టేబుల్ వెంకటరమణ మృతి విషయం తెలుసుకున్న ఎస్పీ దామోదర్ ఆసుపత్రి వద్ద భావోద్వేగానికి గురయ్యారు. తన సిబ్బందిలో ఒకరిని కోల్పోవడంతో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. దీంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎస్పీని సముదాయించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















