గిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అర్హత కలిగిన గిరిజన కుటుంబాలకు త్వరలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ (అటవీ హక్కుల గుర్తింపు చట్టం) పట్టాలు జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
సచివాలయంలో సోమవారం గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల జారీ ప్రక్రియపై జిల్లాల వారీగా పురోగతిని అడిగి తెలుసుకున్నారు. తాజా పరిస్థితిపై సమగ్ర నివేదికలను సమర్పించాలని కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు.
గిరిజనుల అభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 626 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పరిశుభ్రత, ఆహార నిర్వహణను మెరుగుపరిచేందుకు 2,161 మంది క్లీనింగ్ స్టాఫ్, కుక్‌లు, కమాటీలను పొరుగుసేవల విధానంలో నియమించనున్నట్లు వెల్లడించారు.
ఈ నియామకాలకు ప్రభుత్వం రూ.46 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించేందుకు పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇందుకోసం రూ.21.80 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
విద్యార్థుల రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ట్రంక్ బాక్స్‌లు, బెడ్ షీట్లు, మ్యాట్రెస్‌లు, వాటర్ టెస్టింగ్ కిట్ల కొనుగోలుకు మరో రూ.50 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. గిరిజన విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతి, ఆరోగ్యకరమైన వాతావరణం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను పెంచడం, మౌలిక వసతులను బలోపేతం చేయడం, గిరిజన కుటుంబాలకు హక్కులను కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















