ఎల్‌నినో పరిస్థితులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లాల వారీగా రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను వెంటనే అమలు చేసేలా సిద్ధంగా ఉండాలని సూచించారు.
సచివాలయం నుంచి సోమవారం మంత్రి తుమ్మల.. వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, వ్యవసాయశాఖ సంచాలకుడు గోపిలతో కలిసి అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, పంటల సాగు పరిస్థితి, రైతులకు అందుతున్న సలహాలు, ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలపై సమీక్షించారు.
ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గే పరిస్థితులు ఏర్పడితే రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలని మంత్రి సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు అందిస్తున్న సూచనలు, పంటల సాగుపై సలహాలను రైతులకు సకాలంలో చేరవేయాలని అధికారులను ఆదేశించారు.
‘‘వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు సరైన సమయంలో సరైన సమాచారం అందితే నష్టాలను తగ్గించవచ్చు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా పనిచేయాలి’’ అని మంత్రి తెలిపారు.
ఇప్పటికే ‘తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం’ ద్వారా రైతులకు వాట్సప్ వేదికగా కచ్చితమైన, సమయానుకూల వాతావరణ సమాచారం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. వర్షపాతం, ఉష్ణోగ్రతలు, పంటల సాగుకు అనుకూల పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు నిరంతరం సూచనలు అందించాలని తెలిపారు.
వర్షాభావ పరిస్థితులు ఎదురైతే తక్కువ నీటితో సాగు చేసే పంటలు, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాల విషయంలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని చెప్పారు.
జిల్లాల వారీగా రూపొందించిన ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ అమలు చేయాలని, రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం అందించాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామస్థాయిలో రైతులతో అందుబాటులో ఉండాలని సూచించారు.
రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గిస్తూ రైతులకు భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















