మారుతున్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ భవిష్యత్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ, యువతరం ముందుకు వచ్చి పరిశ్రమకు కొత్త ఊపిరి పోస్తోందని ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఈ యువ ప్రతిభకు బలమైన వేదికగా ఈటీవీ విన్ నిలుస్తోందని, ఉషాకిరణ్ మూవీస్ స్థాపకుడు రామోజీరావు కలలలో ఒకటైన కొత్త కథలు, కొత్త ప్రతిభకు అవకాశాలు కల్పించే లక్ష్యం ఇప్పుడు ఈటీవీ విన్ ద్వారా నెరవేరుతోందని ఆయన పేర్కొన్నారు.
‘గద్దర్ సినీ పురస్కారాలు–2025’లో ఎంపికైన ఈటీవీ విన్ చిత్ర బృందాలతో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజతో పాటు ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న ఈటీవీ విన్ చిత్ర బృందాలను సంస్థ తరఫున అభినందించారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ, “మేము సినిమాలు తీస్తున్న కాలంలోనే రామోజీరావు గారు సినీ నిర్మాణంలోకి వచ్చారు. ఆయన పెద్ద హీరోలతో సినిమాలు తీస్తారనుకున్నాం. కానీ చిన్న సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చి వాటితోనే పెద్ద విజయాలు సాధించారు. ఉషాకిరణ్ మూవీస్ తొలి నాలుగు సినిమాలే పరిశ్రమలో సంచలనం సృష్టించాయి” అని గుర్తుచేశారు.
ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా చిన్న సినిమాలు తీయడం సవాలుగా మారినప్పటికీ, ఈటీవీ విన్ వెనుక ఉన్న యువ బృందం మంచి కథలతో సినిమాలు నిర్మిస్తూ పరిశ్రమకు కొత్త ధైర్యం ఇస్తోందన్నారు. ఈ వేదిక కోసం తీసిన కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలై రూ.40–50 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తున్నాయి అని తెలిపారు. కొత్త కథలు, రచయితలు, దర్శకులను ప్రోత్సహించడం ద్వారా పరిశ్రమకు కొత్త దారులు చూపుతోందని అన్నారు.
అదే కార్యక్రమంలో మాట్లాడిన ఆర్. నారాయణమూర్తి, గద్దర్ సినీ పురస్కారాలను పారదర్శకంగా ప్రకటించిన జ్యూరీ సభ్యులను, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. “ఒకప్పుడు నంది పురస్కారాలకు ఎంతో గౌరవం ఉండేది. 13 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరిట పురస్కారాలు ఏర్పాటు చేసి చిత్ర పరిశ్రమకు కొత్త గుర్తింపునిచ్చింది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నంది పురస్కారాలను మళ్లీ ప్రకటించి పరిశ్రమను ప్రోత్సహించాలి” అని సూచించారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ, భవిష్యత్తులో మరింత నాణ్యమైన కంటెంట్ ప్రేక్షకులకు అందిస్తామని తెలిపారు. కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ, “గద్దర్ పురస్కారాలు మా కోసం ఆస్కార్ కంటే గొప్ప గౌరవం. ఇవి కేవలం అవార్డులు మాత్రమే కాదు, కొత్త ప్రతిభకు స్ఫూర్తి” అన్నారు.
ఈ కార్యక్రమంలో ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘లిటిల్ హార్ట్స్’, ‘అనగనగా’, ‘మౌనమే నీ భాష’ చిత్ర బృందాలు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews



















