పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలిక లిఫ్ట్ నుంచి కిందపడి మృతిచెందింది. అయితే తమ కుమార్తె మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లి పోలేరమ్మ ఆలయం సమీపంలో కిరాణా దుకాణంలో పనిచేసే భవరిశెట్టి మహేష్, మణిదీపిక దంపతులు నివాసముంటున్నారు. వారికి రేవతి(12) అనే ఏకైక కుమార్తె ఉంది. ఆమె స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది.
ఆదివారం రేవతి తన ఇంటికి సమీపంలో నివసించే ఇద్దరు చిన్నారులతో కలిసి ఆడుకునేందుకు వారి ఇంటికి వెళ్లింది. ఆ చిన్నారుల తాతయ్య కోటేశ్వరరావు కుటుంబం ఇటీవలే తమ మూడంతస్తుల భవనంలో లిఫ్ట్ ఏర్పాటు చేసుకుంది. సాయంత్రం సమయంలో లిఫ్ట్ నుంచి పెద్ద శబ్దం వినిపించడంతో కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి చూశారు. రేవతి తీవ్ర గాయాలతో గ్రౌండ్ ఫ్లోర్‌లో పడి ఉండటాన్ని గుర్తించారు.
వెంటనే బాలికను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
తమ కుమార్తె మృతి ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలను తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. లిఫ్ట్ తలుపులు తెరుచుకోకుండానే నాలుగైదు అడుగుల మేరకు పైకి వెళ్లినట్లు కనిపిస్తోందని వారు తెలిపారు. అంతేకాకుండా లిఫ్ట్‌కు ఒకవైపు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ షీట్లు పగిలి ఉండటాన్ని వారు ప్రస్తావించారు. ఆ ప్రదేశం నుంచే బాలిక బయటకు వచ్చి కిందపడినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
తమ కుమార్తె మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
సమాచారం అందుకున్న డీఎస్పీ కృష్ణచైతన్య ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. లిఫ్ట్ పరిస్థితి, భవనంలోని పరిసరాలను పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి దారితీసిన కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత బాలిక మృతి వెనుక అసలు కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















