ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రాష్ట్రంలో 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఏర్పాటు చేసింది. మొత్తం రూ.249.50 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చాయి.
క్రిటికల్ కేర్ బ్లాక్‌ల ద్వారా తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు అధునాతన అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర చికిత్సతో పాటు ఐసీయూ, వెంటిలేటర్ వంటి కీలక సదుపాయాలు అందుబాటులో ఉండటంతో తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్న రోగులకు సత్వర వైద్యం అందించే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలల ఏర్పాటుతో వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఒకేచోట నిర్వహించే సదుపాయం కలగనుంది. దీంతో రోగులు అవసరమైన పరీక్షల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.
రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్య మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని జీజీహెచ్‌లలో క్రిటికల్ కేర్ బ్లాక్‌లు నిర్మించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం జిల్లా ఆసుపత్రిలోనూ క్రిటికల్ కేర్ బ్లాక్ సిద్ధమైంది.
మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు, విశాఖపట్నం జిల్లా అగనంపూడి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, కాకినాడ జిల్లా తుని, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, బాపట్ల జిల్లా చీరాల, పల్నాడు జిల్లా నరసరావుపేట, నంద్యాల జిల్లా బనగానపల్లి, చిత్తూరు జిల్లా పలమనేరు, అనంతపురం జిల్లా గుంతకల్లు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని ఏరియా ఆసుపత్రుల్లో ఐపీహెచ్‌ఎల్‌లను ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే జిల్లాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో పెద్ద నగరాల్లోని ఆసుపత్రులపై ఆధారపడాల్సిన అవసరాన్ని కొంతమేర తగ్గించడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ మౌలిక వసతులు దోహదపడనున్నాయి.
ఈ నెల 31న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కేంద్రాలను ప్రారంభించేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడలోని పాత జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రత్యక్షంగా ప్రారంభించి, మిగిలిన కేంద్రాలను వర్చువల్ విధానంలో ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించింది.
అయితే అదే రోజు వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ప్రారంభ కార్యక్రమం తేదీపై తుది స్పష్టత రావాల్సి ఉంది. వైద్య రంగంలో మౌలిక వసతుల విస్తరణతో రాష్ట్ర ప్రజలకు అత్యవసర సమయంలో వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















