భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ తమీమ్ ఇక్బాల్ తెలిపారు. ఈ అంశంపై బీసీసీఐతో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే సిరీస్ ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమన్నారు. భారత్ తప్పకుండా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘భారత్‌తో సిరీస్ జరగాలా? వద్దా? అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో రెండు బోర్డులూ చిత్తశుద్ధితోనే ఉన్నాయి. సిరీస్ కోసం క్రికెట్ క్యాలెండర్లో ప్రత్యేక విండోను కూడా ఉంచాం. అయితే అది ఎప్పుడు జరుగుతుందనేది ప్రస్తుతం చెప్పలేం. భారత్ తప్పకుండా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుందని ఆశిస్తున్నా’’ అని తమీమ్ పేర్కొన్నారు.
ముస్తాఫిజుర్ రెహమాన్ విషయంలో తలెత్తిన వివాదంపై కూడా తమీమ్ స్పందించాడు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర నిరాశకు కారణమైందని అంగీకరించాడు. అయితే తమ బోర్డు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందని చెప్పాడు.
వివాదం మొదలైన తొలినాళ్లలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి ఉంటే సమస్య ఇంత దూరం వెళ్లేది కాదని అభిప్రాయపడ్డాడు. ఒక అంశాన్ని వెనక్కి తీసుకురాలేని స్థాయికి తీసుకెళ్లిన తర్వాత పరిష్కారం కనుగొనడం కష్టమవుతుందని వ్యాఖ్యానించాడు.
గత ప్రపంచకప్ సమయంలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని తమీమ్ తెలిపాడు. బంగ్లాదేశ్ ఆ టోర్నీలో పాల్గొని ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా మరింత సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నాడు.
క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టకూడదని తమీమ్ సూచించాడు. అంతర్జాతీయ రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ క్రీడా పోటీల్లో దేశాలు పాల్గొంటున్న ఉదాహరణలను ప్రస్తావించాడు.
‘‘క్రీడలను ఎప్పుడూ రాజకీయాలతో ముడిపెట్టొద్దు. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం జరిగినప్పటికీ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఇరాన్ వెళ్లింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న సమస్యల కంటే ఆ రెండు దేశాల మధ్య సమస్య మరింత పెద్దదే. మేం గత ప్రపంచకప్‌లో ఆడి ఉండాల్సింది. పరిస్థితిని మరింత సంయమనంతో అదుపులోకి తీసుకొచ్చి ఉంటే బాగుండేది’’ అని తమీమ్ వ్యాఖ్యానించాడు.
ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్లో ఆడించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ.. ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఆదేశించింది. దీంతో బంగ్లాదేశ్ పేసర్‌ను కేకేఆర్ జట్టు నుంచి విడుదల చేసింది.
ఇప్పుడు ఇరు దేశాల క్రికెట్ సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. భారత్ పర్యటనపై తమీమ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















