ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ఇంధన సరఫరా అవరోధాలు వంటి సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసికమైన ఏప్రిల్-జూన్‌లో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా వేసిన 7 శాతంతో పోలిస్తే ఇది మెరుగైన వృద్ధి కావడం విశేషం.
2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్‌లో స్థిర ధరల వద్ద వాస్తవ జీడీపీ రూ.75.46 లక్షల కోట్లుగా ఉండగా.. 2026-27 తొలి త్రైమాసికంలో ఇది రూ.81.36 లక్షల కోట్లకు చేరినట్లు గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో వార్షిక ప్రాతిపదికన 7.8 శాతం వృద్ధి నమోదైంది.
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా వృద్ధి సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాకు ఎదురవుతున్న అవరోధాలు, ప్రపంచ వాణిజ్యంలో మారుతున్న పరిణామాలు వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్నప్పటికీ భారత్ మాత్రం వృద్ధి బాటలో కొనసాగుతోంది.
అయితే అంతకుముందు త్రైమాసికమైన 2026 జనవరి-మార్చిలో నమోదైన 8.6 శాతం వృద్ధితో పోలిస్తే తాజా త్రైమాసికంలో వృద్ధి కొంత తగ్గింది. అయినప్పటికీ ఆర్‌బీఐ అంచనాలను మించి 7.8 శాతం నమోదు కావడం ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుత ధరల వద్ద జీడీపీ లేదా నామినల్ జీడీపీ 2026-27 తొలి త్రైమాసికంలో రూ.88.27 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 2025-26 ఇదే కాలంలో నమోదైన రూ.80 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 10.3 శాతం అధికం.
జీడీపీ వృద్ధి గణాంకాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణకు సానుకూల ఫలితాలు లభిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో అంతర్గతంగా ఉన్న బలం తాజా వృద్ధి గణాంకాల్లో ప్రతిబింబించిందని తెలిపారు.
2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులై కాలంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.4,55,144 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో నిర్దేశించిన ద్రవ్యలోటు లక్ష్యంలో ఇది 26.9 శాతానికి సమానమని గణాంకాలు వెల్లడించాయి.
భారత్ 7.8 శాతం జీడీపీ వృద్ధిని సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది అసాధారణ ఘనతగా అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థపై సందేహాలు వ్యక్తం చేస్తున్న వారికి తాజా గణాంకాలు సమాధానమని పేర్కొంటూ.. ‘భారత్ ప్రగతి బాటలో మళ్లీ వికసించింది’ అని అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















