హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేశారు. తనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించి మరో అధికారిని నియమించాలని ఇచ్చిన ఆదేశాలను రంగనాథ్ అప్పీల్‌లో ప్రశ్నించారు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ కోర్టును ఆశ్రయించింది. ఈ నెల 17న జరిగిన కూల్చివేతలను సవాల్ చేస్తూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ విచారణ జరిపారు.
విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించే అధికారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానం ఆదేశాలను విచ్చలవిడిగా ధిక్కరించడం, పదేపదే ఉల్లంఘించడం చట్టబద్ధ పాలనను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత అధికారి కీలక పదవిలో కొనసాగడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అదేవిధంగా హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తప్పించి, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో 9,290 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉండగా.. కేవలం ఏడాదిన్నర వ్యవధిలో ఒకే అధికారిపై 63 ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంపై న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఐజీ ర్యాంకులో, కార్యదర్శి స్థాయి హోదాలో ఉన్న హైడ్రా కమిషనర్‌కు ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆస్తులను రక్షించడం ప్రధాన బాధ్యత అని కోర్టు పేర్కొంది.
హైడ్రాను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 99లో ఈ అంశం స్పష్టంగా ఉందని న్యాయస్థానం గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రంగనాథ్ అప్పీల్‌కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అప్పీల్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణలో తదుపరి పరిణామాలు వెల్లడికానున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















