రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఐదు వేల ఆలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను త్వరితగతిన ఖరారు చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో తితిదే, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆలయ నిర్మాణాలు, ధార్మిక, విద్య, వైద్య సేవలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
హైందవ ధర్మం, ఆధ్యాత్మికతను ప్రోత్సహించేలా తితిదే కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని సీఎం సూచించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా సమకూరే నిధులను ఆలయ నిర్మాణం, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తితిదేకు సంబంధించిన 11.8 లక్షల మంది శ్రీవారి సేవకుల సేవలను కొత్తగా నిర్మించే ఆలయాల్లోనూ వినియోగించుకోవాలని సూచించారు.
ఆలయాల నిర్వహణలో భక్తుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు బోర్డు సభ్యులు, భక్తులు, శ్రీవారి సేవకులతో కార్యనిర్వాహక కమిటీల ఏర్పాటుపై పరిశీలన చేయాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరపాలని ఆదేశించారు. విదేశాల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఆసక్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మారిషస్ వంటి దేశాలతోనూ సంప్రదింపులు జరపాలని సూచించారు.
అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 161 నియోజకవర్గాల నుంచి 4,192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర సీఎంకు వివరించారు. ఇప్పటికే 967 ఆలయాల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.
తిరుమలతో పాటు దిగువన ఉన్న తిరుపతి నగరాన్ని కూడా దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. శ్రీవారి సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా కల్యాణాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకునే వేదికగా తిరుపతిని అభివృద్ధి చేయాలని అన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా నగర అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ఆలయాల్లో సేవలందించే అర్చకులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు కోర్సులను రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఆలయాల్లో విగ్రహాల ఏర్పాటు, పూజా విధానాలు, అర్చకుల శిక్షణకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న వెయ్యి పాత ఆలయాలను గుర్తించి వాటి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని అన్నారు. శివాలయాలు, శక్తిపీఠాల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
దేవాదాయశాఖ పరిధిలోని 29 వేల ఆలయాలు, తితిదే నిర్వహిస్తున్న 65 ఆలయాల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక అవసరమని సీఎం పేర్కొన్నారు. ఆలయాల నిర్వహణ, భక్తులకు అందించే సౌకర్యాలు, ధార్మిక కార్యక్రమాల విషయంలో దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
తితిదే ఆధ్వర్యంలోని విద్య, వైద్య సేవలను మరింత సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు అన్నారు. వైద్యులను శ్రీవారి సేవకులుగా మార్చి బోధన, శిక్షణ కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
తితిదే పరిధిలోని 33 విద్యాసంస్థల వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















