ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడి నాలుగు నెలలు గడుస్తున్నా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. ఉన్నత విద్య కమిషనరేట్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 26న సీట్ల కేటాయింపు పూర్తి చేసి, 27 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉంది. అయితే సీట్ల కేటాయింపు ప్రక్రియ వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. తొలుత సెప్టెంబరు 2కు, తాజాగా 7వ తేదీకి వాయిదా పడింది.
డిగ్రీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు ఇప్పటికే సుమారు 140 రోజులుగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇంజినీరింగ్ కోర్సుల్లో రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తవడంతో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో డిగ్రీ ప్రవేశాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సీట్ల కేటాయింపు పూర్తయిన తర్వాత కూడా రెండో విడత కౌన్సెలింగ్, స్పాట్ అడ్మిషన్లు, యాజమాన్య కోటా సీట్ల భర్తీ వంటి ప్రక్రియలు చేపట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యేలోగా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో సెప్టెంబరు మధ్యలో తరగతులు ప్రారంభమయ్యే పరిస్థితి ఏర్పడితే విద్యా సంవత్సరాన్ని సకాలంలో పూర్తి చేయడం కష్టమవుతుందని కళాశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం బీఎస్సీ, బీకాం, బీసీఏ వంటి కోర్సులకు విద్యార్థుల్లో మంచి ఆదరణ ఉంది. సాంకేతిక, సాఫ్ట్‌వేర్ రంగాల్లో అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కొందరు విద్యార్థులు బీసీఏ, కంప్యూటర్ సంబంధిత కోర్సుల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది.
ఇంటర్ ఫలితాలు విడుదలైన వెంటనే డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తే విద్యార్థులకు సమయం ఆదా కావడంతోపాటు కళాశాలల్లో విద్యా కార్యక్రమాలు కూడా సకాలంలో ప్రారంభమయ్యేవి. కానీ షెడ్యూల్ పదేపదే మారడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. డిగ్రీలో అన్ని కోటాలు కలిపి ఏటా సుమారు 1.79 లక్షల మంది వరకు ప్రవేశాలు పొందుతున్న నేపథ్యంలో ఈ జాప్యం ప్రభావం పెద్ద సంఖ్యలో విద్యార్థులపై పడే అవకాశం ఉంది.
మూడేళ్ల డిగ్రీ కోర్సులో చివరి ఏడాది మొత్తం అప్రెంటిస్‌షిప్ ఉండేలా కొత్త కోర్సులను రూపొందించేందుకు ఉన్నత విద్యా మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ కోర్సులను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని భావించినప్పటికీ.. కళాశాలల అంగీకారం, కౌన్సెలింగ్ ప్రక్రియ వంటి అంశాలను కారణంగా చూపుతూ ప్రతిపాదనలను ఉన్నత విద్య కమిషనరేట్ పక్కన పెట్టింది.
దీంతో ఒకవైపు కొత్త తరహా అప్రెంటిస్‌షిప్ డిగ్రీలు అందుబాటులోకి రాకపోగా.. మరోవైపు సాధారణ డిగ్రీ ప్రవేశాల ప్రక్రియలోనూ జాప్యం కొనసాగుతోందని విద్యార్థులు, విద్యావేత్తలు అంటున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















