ఒకప్పుడు ఇంజినీరింగ్ చదివితే ఉద్యోగం దాదాపు ఖాయమనే నమ్మకం ఉండేది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచ్‌ల విద్యార్థులకు క్యాంపస్ నియామకాల ద్వారా కొలువులు సులభంగా లభించేవి. అయితే ప్రస్తుతం సాంకేతిక రంగంలో చోటుచేసుకుంటున్న వేగవంతమైన మార్పులతో ఉద్యోగాల స్వరూపం, సంస్థల అవసరాలు, ఉద్యోగ మార్కెట్లో కోరుకునే నైపుణ్యాలు కూడా మారుతున్నాయి.
కృత్రిమ మేధ, జెనరేటివ్ ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు పరిశ్రమల్లో అనేక పనులను వేగంగా పూర్తి చేస్తున్నాయి. గతంలో వారాలు, నెలలు పట్టే కొన్ని కోడింగ్, టెస్టింగ్, నిర్వహణ పనులను ఏఐ ఆధారిత వ్యవస్థలు తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతున్నాయి. దీంతో కేవలం ఒక ప్రోగ్రామింగ్ భాషపై పట్టు సాధించడం మాత్రమే కెరియర్ భద్రతకు సరిపోదని నిపుణులు సూచిస్తున్నారు.
భవిష్యత్తు ఇంజినీరింగ్‌లో మల్టీడిసిప్లినరీ విద్య కీలకంగా మారనుంది. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు డేటా స్ట్రక్చర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, గణాంక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, నైతిక విలువలు, కమ్యూనికేషన్ వంటి అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలి.
అదేవిధంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ వంటి బ్రాంచ్‌ల విద్యార్థులు ఏఐ, డేటా విశ్లేషణ, ప్రోగ్రామింగ్, డిజిటల్ ట్విన్స్, సెన్సార్ డేటా విశ్లేషణ, ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతికతలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఏఐ కారణంగా సీఎస్ఈ, ఐటీ రంగాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం కంటే వాటి స్వరూపం మారే అవకాశం ఎక్కువగా ఉంది. వెబ్ డెవలప్మెంట్, యాప్ డిజైనింగ్, మాన్యువల్ టెస్టింగ్, సాధారణ బ్యాక్ఎండ్ డెవలప్మెంట్ వంటి పనుల కంటే సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ ఏఐ, ప్రైవసీ ఇంజినీరింగ్, డేటా గవర్నెన్స్, ఏఐ మోడల్ విశ్లేషణ, ఎల్ఎల్ఎం ఇంజినీరింగ్, ఏఐ ఏజెంట్లు, క్లౌడ్ మౌలిక వసతులు, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, డిజిటల్ ఫోరెన్సిక్, ఏఐ గవర్నెన్స్, సేఫ్టీ ఇంజినీరింగ్ వంటి రంగాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు కూడా తమ బోధనా విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. బీటెక్ మొదటి ఏడాది నుంచే ఏఐ ఆధారిత సాధనాలు, ప్రోగ్రామింగ్, డేటా విశ్లేషణ, క్లౌడ్ సేవలు, ఓపెన్ సోర్స్ సాంకేతికత, పరిశ్రమల సమస్యల ఆధారిత ప్రాజెక్టులు, పరిశోధన, ఇంటర్న్‌షిప్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి.
అదే సమయంలో విద్యార్థులు ఏఐ సాధనాలను ఉపయోగించడం మాత్రమే కాకుండా.. వాటి పరిమితులు, బాధ్యతాయుత వినియోగం, నైతికత, భద్రత, చట్టపరమైన అంశాలను కూడా అర్థం చేసుకోవాలి.
ఏఐ విస్తరణతో ఇంజినీరింగ్‌లో కొత్త ప్రత్యేక విభాగాలు కూడా ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. ఏఐ సిస్టమ్స్ ఇంజినీరింగ్, హ్యూమన్–ఏఐ కొలాబొరేషన్, ఏఐ సెక్యూరిటీ, ఏఐ గవర్నెన్స్, ఏఐ కంప్లయన్స్, డిజిటల్ ట్విన్, రోబోటిక్ సిస్టమ్స్, అటానమస్ మొబిలిటీ, సెమీకండక్టర్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ ఏఐ, క్లైమెట్ టెక్నాలజీ, సింథటిక్ డేటా, ఏఐ రిలయబిలిటీ, కంప్యుటేషనల్ బయాలజీ, క్వాంటమ్ సాఫ్ట్వేర్ వంటి రంగాలు భవిష్యత్తులో మరింత కీలకంగా మారవచ్చు.
రాబోయే కాలంలో ప్రతి ఇంజినీరింగ్ విభాగంలోనూ ఏఐ వినియోగం పెరగనుంది. సివిల్ ఇంజినీర్లు డిజిటల్ ట్విన్ నగరాలు, స్మార్ట్ మౌలిక వసతులు, ఏఐ ఆధారిత నిర్మాణ పర్యవేక్షణలో పనిచేయవచ్చు. మెకానికల్ ఇంజినీర్లకు రోబోటిక్స్, ఆటోమేషన్, త్రీడీ ప్రింటింగ్ ఆధారిత తయారీ రంగాల్లో అవకాశాలు పెరగొచ్చు.
ఎలక్ట్రికల్ ఇంజినీర్లు విద్యుత్ వాహనాలు, స్మార్ట్ గ్రిడ్లు, బ్యాటరీ సాంకేతికత, పునరుత్పాదక ఇంధన రంగాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ విద్యార్థులకు ఎంబెడెడ్ సిస్టమ్స్, చిప్ డిజైన్, డ్రోన్లు, వైద్య పరికరాలు, పారిశ్రామిక ఆటోమేషన్ వంటి రంగాలు కీలకంగా మారనున్నాయి. కెమికల్ ఇంజినీరింగ్‌లోనూ ఏఐ ఆధారిత నియంత్రణ వ్యవస్థలు, గ్రీన్ కెమిస్ట్రీ, కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి ప్రాధాన్యం పెరగనుంది.
భవిష్యత్తులో విజయవంతమైన కెరియర్ను నిర్ణయించేది కేవలం డిగ్రీ కాదు.. నిరంతరం నేర్చుకునే సామర్థ్యం. ఒకసారి నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో దశాబ్దాల పాటు అదే ఉద్యోగంలో కొనసాగగల పరిస్థితులు క్రమంగా తగ్గుతున్నాయి.
కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, వాటిని వాస్తవ సమస్యలకు అన్వయించడం, సాంకేతిక మార్పులను స్వీకరించడం, ఏఐతో కలిసి పనిచేయడం ప్రతి విద్యార్థి, ఉద్యోగికి కీలకంగా మారనుంది. ఏఐ మానవ మేధస్సును పూర్తిగా భర్తీ చేయకపోయినా.. ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోని వారిని మాత్రం ఉద్యోగ మార్కెట్లో వెనక్కి నెట్టే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















