సికింద్రాబాద్ బొల్లారం కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. చోరీకి గురైన 12 అధునాతన ఆయుధాలు, నైట్ విజన్ బైనాక్యులర్, ఆయా ఆయుధాలకు సంబంధించిన మందుగుండును పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక అదే రెజిమెంట్‌లో గతంలో పనిచేసిన మాజీ హవిల్దార్ మల్లేశ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
రెజిమెంట్‌లోని పరిస్థితులపై ముందుగానే అవగాహన ఉన్న మల్లేశ్.. విద్యుత్తు సరఫరా నిలిపివేసే సమయంలో సీసీ కెమెరాలు పనిచేయవన్న విషయాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో రెండు రోజులపాటు ఆయుధ నిల్వ ప్రాంతం పరిసరాల్లో రెక్కీ నిర్వహించి, చోరీకి అనువైన సమయాన్ని ఎంచుకున్నాడు.
రాత్రివేళ స్కూటీపై కంటోన్మెంట్‌లోకి ప్రవేశించిన అతడు ఆయుధాగారం తాళాలను పగలగొట్టి ఒక్కో ఆయుధాన్ని బయటకు తీసుకొచ్చాడు. అనంతరం మందుగుండును కూడా అపహరించి, వాటిని వేర్వేరు ప్రాంతాల్లో దాచాడు. గార్డు అనుమానం వ్యక్తం చేసిన సమయంలో తాను ‘20 మద్రాస్ రెజిమెంట్’కు చెందిన వ్యక్తినని చెప్పడంతో అతడు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
చోరీ అనంతరం దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు మల్లేశ్ పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు గుర్తించారు. టోల్‌గేట్లు ఉన్న శ్రీశైలం మార్గాన్ని ఎంచుకోకుండా సాగర్‌రోడ్డు, బొంగులూరుగేట్, ఓఆర్‌ఆర్ మీదుగా ప్రయాణించాడు. మధ్యలో ప్రయాణికులను కూడా ఎక్కించుకున్నాడు. దేవరకొండ, డిండి మీదుగా అమ్రాబాద్ చేరుకుని ఆయుధాలను గడ్డివాములో దాచాడు.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు భారీగా సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. వారంలో సుమారు 8.5 లక్షల మొబైల్‌ఫోన్ సీడీఆర్‌లను విశ్లేషించినట్లు అధికారులు తెలిపారు. మల్లేశ్ ప్రవర్తనపై అనుమానం రావడంతో అతడిని విచారించగా తొలుత తడబడ్డాడు. అనంతరం కుటుంబ సభ్యుల ప్రశ్నలతో చోరీ విషయాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం మల్లేశ్ ఒక్కడినే నిందితుడిగా గుర్తించినప్పటికీ.. ఈ చోరీలో మరెవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. అతడి ఫోన్‌లో తొలగించిన వాట్సప్ డేటాను రికవరీ చేసి పరిశీలించనున్నారు. విదేశీ ఆయుధ డీలర్లను అతడు సోషల్ మీడియాలో అనుసరించాడన్న అనుమానాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో తేలిన అంశాలపై ఆర్మీకి సమగ్ర నివేదిక అందించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















