సంక్షేమ పథకాల అమలులో కుటుంబాలను విడగొట్టే విధానాలకు స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌ను రద్దు చేసి, భవిష్యత్తులో సంక్షేమ పథకాలన్నింటినీ కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త పింఛన్ల మంజూరుకు ముందే కుటుంబాల మ్యాపింగ్‌ను పూర్తి చేయాలని సూచించారు.
ప్రస్తుత లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఆర్థిక స్థితిగతులను ప్రామాణికంగా తీసుకుని కుటుంబాల వివరాలను క్రమబద్ధీకరించాలని సీఎం పేర్కొన్నారు. రేషన్, పింఛన్లు, ఇళ్లు వంటి పథకాల కోసం కుటుంబ సభ్యులను విడివిడిగా చూపించే విధానం సరికాదన్నారు.
ప్రతి నెలా ఒకటో తేదీని ‘సంక్షేమ దినం’గా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ఆ రోజు ఉదయం పేదలకు పింఛన్లు అందించడంతో పాటు, సాయంత్రం గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ఆయా కుటుంబాలకు ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని వివరించాలని చెప్పారు. పీ4 కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా ఉద్యమస్థాయిలో నిర్వహించాలన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల కోసం భారీగా నిధులు ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. కేవలం పింఛన్లకే రూ.75 వేల కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. అయితే సంక్షేమ పథకాలు అందించడం ఒక్కటే లక్ష్యం కాకుండా.. లబ్ధిదారులను ఆర్థికంగా, సామాజికంగా సాధికారత దిశగా తీసుకెళ్లేలా కార్యాచరణ ఉండాలని సూచించారు.
ప్రభుత్వం నగదు జమ చేసిన విషయం కూడా కొంతమంది లబ్ధిదారులకు తెలియడం లేదని సీఎం పేర్కొన్నారు. ప్రతి సంక్షేమ పథకానికి ప్రత్యేక క్యాలెండర్ రూపొందించి, ఏ పథకాన్ని ఏ తేదీన అమలు చేస్తారో ముందుగానే ప్రకటించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలును పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.
తల్లికి వందనం వంటి పథకాలకు కూడా ప్రత్యేక తేదీలను నిర్ణయించి సకాలంలో నిధులు విడుదల చేయాలని చెప్పారు. అంగన్వాడీ నుంచి పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ వరకు పిల్లల విద్యాభివృద్ధికి సమగ్ర విధానం రూపొందించాలని అధికారులకు సూచించారు.
కుటుంబ సభ్యులను విభజించకుండానే కొత్తగా పెళ్లయిన జంటలకు రేషన్‌కార్డులు అందించే అంశాన్ని పరిశీలించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ 5 కిలోల చొప్పున బియ్యం అందించాలని ఆదేశించారు. కుటుంబంలో 10 మందికి మించి సభ్యులుంటే అదనంగా మరో కిలో బియ్యం ఇవ్వాలని సూచించారు.
అధికారులు ప్రజల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని చంద్రబాబు సూచించారు. ప్రజలు కార్యాలయాలకు వచ్చినప్పుడు వారి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకూడదన్నారు. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని సహానుభూతితో పనిచేయాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ల సదస్సులో శాఖల వారీగా అధికారులు ప్రజంటేషన్లు ఇచ్చే సమయంలో ఎక్కువ సమయం తీసుకోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సుకు వచ్చే ముందే ఏం చెప్పాలన్న దానిపై స్పష్టత ఉండాలని, అవసరమైతే రిహార్సల్స్ చేసుకుని రావాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడంతో పాటు వాటిని కంప్యూటరైజ్ చేయాలని చంద్రబాబు సూచించారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి, వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైనారిటీల సంక్షేమానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న కాపు, బీసీ, ఇతర సామాజిక వర్గాల భవనాలను తొలి దశలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత కార్పొరేషన్లలో అందుబాటులో ఉన్న మిగులు నిధులను వినియోగించాలని, అవసరమైతే అదనపు నిధుల కోసం ఆర్థికశాఖను సంప్రదించాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలోని యానాటి కొండ సామాజికవర్గం సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించగా.. ఎస్టీ హోదాపై నిర్ణయం వెలువడే వరకు వారిని ఈడబ్ల్యూఎస్ పరిధిలోకి తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఎం సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















