రాష్ట్ర పోలీసు శాఖలోని క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా ‘ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీ’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందించడంతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పించి ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లడమే అకాడమీ లక్ష్యమని వెల్లడించారు.
ఈ దిశగా విట్-ఏపీ విశ్వవిద్యాలయంతో రాష్ట్ర పోలీసు శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీజీపీ తెలిపారు. విశ్వవిద్యాలయ సహకారంతో పోలీసు క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో తొలిసారిగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026’ శుక్రవారం ముగిసింది. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు డీజీపీ పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీ లోగోను ఆయన ఆవిష్కరించారు.
నాలుగు రోజుల పాటు జరిగిన ఈ క్రీడా పోటీల్లో రాష్ట్రంలోని వివిధ పోలీసు విభాగాలకు చెందిన సుమారు 1,900 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. అత్యధిక పతకాలు సాధించిన విశాఖపట్నం రేంజ్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఒకే కుటుంబ సభ్యుల్లా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలీసు శాఖలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సిబ్బందిలో శారీరక దారుఢ్యంతో పాటు టీమ్ స్పిరిట్, క్రమశిక్షణ పెంపొందుతాయని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే పోలీసు సిబ్బందికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
మరోవైపు ఈగల్ విభాగం తరఫున పాల్గొన్న క్రీడాకారులు 38 పతకాలు సాధించడం విశేషంగా నిలిచింది. ఇందులో 10 స్వర్ణ, 16 రజత, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ వ్యక్తిగతంగా 8 పతకాలు సాధించారు. ఆయన 2 స్వర్ణ, 4 రజత, 2 కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
‘ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026’లో విశేష ప్రతిభ కనబరిచిన సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కె.మధుసూదన్‌రావును ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. టేబుల్ టెన్నిస్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఆయన స్వర్ణ పతకాలు సాధించారు. టీమ్ ఈవెంట్‌లో రజతం, సెట్స్ డబుల్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. పోలీసు విధులతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటిన మధుసూదన్‌రావును సీఎం అభినందించి ప్రోత్సహించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















