కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 45 రోజులపాటు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్ణయించారు. ఈ కార్యక్రమం ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. ఈ ప్రణాళికలపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం జూమ్ సమావేశం నిర్వహించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, బ్యాక్ ఆఫీస్ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
ఇంటింటి ప్రచారంతో పాటు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ప్రతి నేత చురుగ్గా పాల్గొని ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే రాయబారులుగా పనిచేయాలని లోకేశ్ పేర్కొన్నారు.
ప్రజలకు చేరువ కావడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత బలపరచాలని ఆయన సూచించారు. అధికారం చేపట్టే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిడిలో ఉండేదని, నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గిపోయిందని ఆయన గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నమ్మకాన్ని తిరిగి పునరుద్ధరించామని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.
2014–19 మధ్య కాలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు సమర్థంగా వివరించలేకపోవడం, ప్రత్యర్థుల విషప్రచారం కారణంగానే ఓటమి ఎదురయ్యిందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈసారి ఇంటింటి ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని తెలిపారు.
ఈ నెల 20వ తేదీ వరకు లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయోత్సవ సభలు నిర్వహించాలని సూచించారు. సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బీఎల్‌వోలను నియమించి వారితో ఎమ్మెల్యేలు నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.
అదే విధంగా ప్రజల సమస్యలు, సూచనలు, సలహాలను నమోదు చేసి ప్రభుత్వానికి చేరవేయాలని లోకేశ్ సూచించారు. జనసేన, బీజేపీతో కూడా సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధిని పునరుద్ధరించాలని పలువురు ఎమ్మెల్యేలు కోరగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ అంశాన్ని పరిశీలిస్తామని లోకేశ్ తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















