శ్రావణమాసం.. వరుస పండుగలు.. ఇంట్లో పిండివంటలు చేసుకునే సమయం. కానీ మార్కెట్‌కు వెళ్తే మాత్రం ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఉల్లి నుంచి పంచదార వరకు, బియ్యం నుంచి వంటనూనెల వరకు నిత్యావసరాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో నెలవారీ ఇంటి బడ్జెట్ 20 నుంచి 30 శాతం వరకు పెరిగిందని వినియోగదారులు వాపోతున్నారు.
ప్రస్తుతం కిలో ఉల్లి రూ.55 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. ఏప్రిల్‌లో రూ.20గా ఉన్న ధర జులైలో రూ.37కు చేరి.. ఆగస్టు చివరికి ఏకంగా రూ.55 దాటింది. కర్నూలు ఉల్లి సాగు తగ్గడం, వర్షాభావ పరిస్థితులు ఉత్పత్తిపై ప్రభావం చూపడంతో మార్కెట్‌కు వచ్చే సరకు భారీగా తగ్గింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఉల్లిపైనా ధరల ప్రభావం పడుతోంది.
పంచదార ధర కూడా సామాన్యుడికి షాక్ ఇస్తోంది. కొద్దిరోజుల క్రితం కిలో రూ.50 లోపు ఉన్న పంచదార ప్రస్తుతం రూ.71 వరకు చేరింది. కొన్ని బ్రాండెడ్ రకాల ధరలు రూ.80 నుంచి రూ.90 వరకు ఉన్నాయి. బెల్లం ధర కూడా కిలో రూ.90 నుంచి రూ.100కు చేరడంతో పండుగ పిండివంటల ఖర్చు మరింత పెరుగుతోంది.
ఇప్పటికే బియ్యం ధరలు భారీగా పెరిగాయి. గతంలో కిలో రూ.55 వరకు ఉన్న బియ్యం ప్రస్తుతం రూ.65 నుంచి రూ.69 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో సూపర్‌ఫైన్ రకం రూ.73 వరకు విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ బియ్యం 26 కిలోల బస్తా ధర కూడా రూ.1,300 నుంచి రూ.1,800 వరకు పెరిగింది. ధాన్యం ధరలు కొంత తగ్గినా.. బియ్యం ధరల్లో మాత్రం ఆ మేరకు తగ్గుదల కనిపించడం లేదు.
వంటనూనెల ధరలూ వినియోగదారులకు భారంగా మారాయి. వేరుశనగ నూనె కిలో రూ.185 నుంచి రూ.190, పొద్దుతిరుగుడు నూనె రూ.180 నుంచి రూ.185, పామోలిన్ రూ.160 వరకు పలుకుతున్నాయి. కందిపప్పు ధర కిలో రూ.164కు చేరింది. వెల్లుల్లి ధర కూడా కిలో రూ.300 నుంచి రూ.350 మధ్య కొనసాగుతోంది.
వేరుశనగ ధరలు సైతం పెరిగాయి. నాణ్యమైన రకాలు కిలో రూ.200 వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గడం, వర్షాభావ పరిస్థితులు ఉత్పత్తిపై ప్రభావం చూపడం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
నిత్యావసరాల ధరలు వరుసగా పెరుగుతుండటంతో పండుగల వేళ సామాన్య కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. పప్పులు, నూనెలు, కూరగాయలు, బియ్యం, పంచదార.. ఇలా ప్రతి వస్తువుపైనా పెరిగిన ధరలు నెలవారీ ఖర్చులను పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరగొచ్చన్న ప్రచారం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















