యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం **‘ఫౌజీ’**పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన విడుదల తేదీ ప్రకటన అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “అజ్ఞాతపర్వం ముగిసింది.. ఇక తిరుగుబాటు మొదలైంది” అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్‌లో ప్రభాస్ సరికొత్త అవతారంలో కనిపించాడు. 1932 నుంచి మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తిగా చూపించిన ఈ పోస్టర్ సినిమాలోని కథా నేపథ్యంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
స్వాతంత్య్రానికి ముందు కాలం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రక్తంతో తడిసిన దుస్తులు, చేతిలో ఆయుధంతో ప్రభాస్ కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన పాత్రలకు భిన్నంగా ఉండేలా హను రాఘవపూడి ఈ పాత్రను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి నటిస్తోంది. ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే దాదాపు 75 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. మిగిలిన భాగంలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించాల్సి ఉంది. షూటింగ్ పూర్తయిన అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
మరోవైపు సినిమా ప్రమోషన్స్‌ను కూడా త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన తొలి లిరికల్ సాంగ్‌ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘సీతారామం’ తర్వాత హను రాఘవపూడి ఈ కథపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, కథను సిద్ధం చేయడానికి ఏడాదికి పైగా సమయం పట్టిందని గతంలో వెల్లడించారు.
ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ‘ఫౌజీ’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేమ, యుద్ధం, దేశభక్తి అంశాలను మిళితం చేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆశ్చర్యపరుస్తుందని దర్శకుడు హను రాఘవపూడి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















