దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా- ఇరాన్ మధ్య చర్చలపై అనిశ్చితి, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గరిష్ఠ స్థాయి వద్ద కొనసాగుతుండడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రూపాయి క్షీణత, ఎఫ్‌ఐఐల విక్రయాలు దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ ఓ దశలో 1200 పాయింట్లకు పైగా పతనం కాగా.. నిఫ్టీ 24 వేల పాయింట్ల దిగువకు చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.4 లక్షల కోట్లు క్షీణించి రూ.461 లక్షల కోట్లకు చేరింది.
సెన్సెక్స్ ఉదయం 77,483.80 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,664) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 76,403.87 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 982.71 పాయింట్ల నష్టంతో 76,681.29 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 275.10 పాయింట్ల నష్టంతో 23,879.95 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 94.25గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ మినహా మిగిలిన స్టాక్స్ నష్టాలు చవిచూశాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా స్టాక్స్ ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 107.12 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4681 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అంచనాలు సవరించిన జేపీ మోర్గాన్
ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ భారత స్టాక్ మార్కెట్ రేటింగ్‌ను ‘ఓవర్ వెయిట్’ నుంచి ‘న్యూట్రల్’కు తగ్గించింది. మార్కెట్‌లో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బేరిష్ ట్రెండ్ కొనసాగితే నిఫ్టీ-50 20,500 పాయింట్లకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుత స్థాయిల నుంచి సుమారు 15 శాతం క్షీణించొచ్చని పేర్కొంది. సానుకూలతలు ఉంటే 30 వేల పాయింట్లకు చేరుకోవచ్చని పేర్కొంది. గతంలో బుల్ ట్రెండ్ 33 వేలు ఉండగా.. బేస్ 30వేలు, బేరిష్ 24వేలు పాయింట్లుగా ఉండొచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















