ఉక్రెయిన్–రష్యా యుద్ధం మరింత తీవ్ర దశకు చేరుకుంది. తాజాగా క్రిమియా సహా రష్యా ఆధీనంలోని 12 ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులు జరిపింది. ఒక్క రాత్రిలోనే సుమారు 660 డ్రోన్లను ప్రయోగించినట్లు సమాచారం. ఈ దాడులన్నింటినీ తమ రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.
రాజధాని మాస్కోతో పాటు అజోవ్, నల్ల సముద్ర తీర నగరాలు, క్రిమియా ప్రాంతాలు ఉక్రెయిన్ లక్ష్యంగా మారాయి. మాస్కో వైపు దూసుకొచ్చిన 47 డ్రోన్లను కూల్చివేసినట్లు నగర మేయర్ తెలిపారు. అయితే ఈ దాడుల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.
నోవోమోస్కోవ్‌స్కీ ప్రాంతంలో ఓ కెమికల్ ప్లాంట్, హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసినట్లు సమాచారం. అక్కడ భారీగా మంటలు చెలరేగినట్లు స్థానిక మీడియా చెబుతోంది. అయితే ఈ ఘటనపై రష్యా ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. ఈ దాడుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా గత ఏడాది నుంచి చేస్తున్న శాంతి ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదని పరిస్థితి సూచిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా సైనిక స్థావరాలు, విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ తన దాడులను మరింత తీవ్రతరం చేసింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ‘‘యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో 40 రోజుల ప్రత్యేక ఆపరేషన్ చేపడతాం’’ అని తెలిపారు. ఈ కాలంలో తమ దాడులు మరింత ఉద్ధృతంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే తాజా డ్రోన్ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.
మరోవైపు రష్యా కూడా క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు కొనసాగిస్తోంది. గత 24 గంటల్లో ఖర్కీవ్‌పై జరిగిన దాడుల్లో ఇద్దరు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అలాగే 189 రష్యన్ డ్రోన్లను అడ్డుకున్నామని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న సైనిక చర్య నేపథ్యంలో రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలను యూరోపియన్ యూనియన్ మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ ఆంక్షలు 2027 జూలై 31 వరకు అమల్లో ఉంటాయని అధికారికంగా ప్రకటించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















