‘మీకు అనుభవం ఉందా?’.. ఉద్యోగ ఇంటర్వ్యూల్లో తరచూ వినిపించే ప్రశ్న ఇది. అయితే అనుభవం సంపాదించాలంటే ముందుగా అవకాశం కావాలి. సాధారణంగా ఇంటర్న్‌షిప్పులు ఆరు నెలల నుంచి ఏడాది వరకు కొనసాగుతుంటాయి. చదువుతో పాటు అంత సుదీర్ఘకాలం పనిచేయడం ప్రతి విద్యార్థికీ సాధ్యం కాదు. ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వస్తున్న విధానమే మైక్రో-ఇంటర్న్‌షిప్పు.
చిన్న వ్యవధిలో పూర్తయ్యే ప్రాజెక్టులు, పరిమిత పని గంటలు, వాస్తవ ప్రపంచ అనుభవం.. ఇవన్నీ మైక్రో-ఇంటర్న్‌షిప్పుల ప్రత్యేకతలు. చదువుకు అంతరాయం లేకుండా పరిశ్రమ అవసరాలను అర్థం చేసుకునేందుకు, తమ నైపుణ్యాలను పరీక్షించుకునేందుకు ఇవి విద్యార్థులకు ఉపయోగపడతాయి.
చిన్న టాస్కులు.. విలువైన అనుభవం :
సాధారణ ఇంటర్న్‌షిప్పులతో పోలిస్తే మైక్రో-ఇంటర్న్‌షిప్పులు చాలా తక్కువ వ్యవధిలో పూర్తవుతాయి. వారం రోజుల ప్రాజెక్టు, పది రోజుల అసైన్‌మెంట్, నెల రోజుల పార్ట్‌టైమ్ పని లేదా కొన్ని గంటల్లో పూర్తయ్యే టాస్కులు కూడా ఇందులో ఉండొచ్చు.
సోషల్ మీడియా కంటెంట్ ప్రణాళిక రూపొందించడం, చిన్న డేటా సముదాయాన్ని విశ్లేషించడం, మార్కెట్ పరిశోధన చేయడం, వెబ్‌సైట్‌లో ఓ ఫీచర్‌ను పరీక్షించడం, వినియోగదారుల అభిప్రాయాలను విశ్లేషించడం, ప్రజెంటేషన్ తయారు చేయడం వంటి పనులు ఇందులో భాగం కావచ్చు.
ఇక్కడ పని పరిమాణం కంటే.. ఆ పని ద్వారా విద్యార్థి నేర్చుకున్నది, సాధించిన నైపుణ్యాలే కీలకం.
రెజ్యూమెకు అదనపు బలం :
ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో కేవలం విద్యార్హతలు, సర్టిఫికెట్లు మాత్రమే సరిపోవడం లేదు. అభ్యర్థి నేర్చుకున్న విషయాలను ఆచరణలో ఎలా ఉపయోగించగలడన్నది సంస్థలు గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రో-ఇంటర్న్‌షిప్పులు రెజ్యూమెకు అదనపు విలువను తీసుకొస్తాయి.
‘జర్నలిజంపై ఆసక్తి ఉంది’ అని చెప్పడం కంటే.. ఓ స్థానిక సమస్యపై కథనం రూపొందించి, దాన్ని డిజిటల్ వేదికకు అనుగుణంగా మార్చిన అనుభవాన్ని వివరించడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. వీలైతే చేసిన ప్రాజెక్టులకు సంబంధించిన లైవ్ లింకులు, నమూనా పనులను కూడా పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవచ్చు.
నైపుణ్యాలకు పదును :
మైక్రో-ఇంటర్న్‌షిప్పులతో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనేక సాఫ్ట్ స్కిల్స్ కూడా అభివృద్ధి చెందుతాయి. సమయ నిర్వహణ, బృందంగా పనిచేయడం, కమ్యూనికేషన్, పరిశోధన, ప్రజెంటేషన్, సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన, వృత్తిపరమైన ప్రవర్తన వంటి నైపుణ్యాలు ఆచరణలో అలవడతాయి.
కొన్ని సంస్థలు ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు రిఫరెన్స్ లెటర్లు లేదా పనితీరు ఆధారిత ఫీడ్‌బ్యాక్ కూడా అందిస్తాయి. ఇవి భవిష్యత్తు ఇంటర్వ్యూల్లో ఉపయోగపడటమే కాకుండా కొత్త అవకాశాలకు మార్గం చూపవచ్చు.
తరగతి గది నుంచి కార్యక్షేత్రానికి :
పుస్తకాల్లో నేర్చుకున్న సిద్ధాంతాలను వాస్తవ ప్రపంచంలో ప్రయోగించినప్పుడే వాటిపై పూర్తి అవగాహన వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ చదివే విద్యార్థి ఓ చిన్న ప్రచార ప్రాజెక్టు చేయడం ద్వారా వినియోగదారుల స్పందనను అర్థం చేసుకోవచ్చు. కోడింగ్ నేర్చుకునే విద్యార్థి చిన్న అప్లికేషన్ రూపొందించవచ్చు. డిజైనింగ్ విద్యార్థి ఓ బ్రాండ్ కోసం పోస్టర్ లేదా ప్రచార రూపకల్పన చేయవచ్చు.
ఇలాంటి ప్రాజెక్టులు ‘నేను ఈ విషయం చదివాను’ అనే స్థాయి నుంచి ‘నేను ఈ పని చేశాను’ అనే స్థాయికి విద్యార్థులను తీసుకెళ్తాయి.
కెరియర్‌పై స్పష్టత :
ఏ కోర్సు ఎంచుకోవాలి? ఏ రంగంలో కెరియర్ కొనసాగించాలి? అనే సందేహాలు చాలామంది విద్యార్థులను వేధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో మైక్రో-ఇంటర్న్‌షిప్పులు తమ ఆసక్తి, సామర్థ్యాలను పరీక్షించుకునే అవకాశాన్ని ఇస్తాయి.
ఓ రంగానికి సంబంధించిన చిన్న ప్రాజెక్టులు చేసిన తర్వాత ఆ పని నిజంగా ఆసక్తికరంగా ఉందా? తమ నైపుణ్యాలు ఆ రంగానికి సరిపోతున్నాయా? మరింత నేర్చుకోవాల్సిన అంశాలేంటి? వంటి విషయాలపై స్పష్టత వస్తుంది. అంతేకాకుండా సంస్థల నిపుణులు, మేనేజర్లు, హెచ్‌ఆర్ సిబ్బందితో పరిచయాలు ఏర్పడటం వల్ల భవిష్యత్తులో ఇంటర్న్‌షిప్పులు లేదా ఉద్యోగ అవకాశాలకు కూడా మార్గం సుగమం కావచ్చు.
ఏఐ యుగంలో మరింత అవసరం :
కృత్రిమ మేధ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఉద్యోగాల స్వభావం కూడా మారుతోంది. ఈ పరిస్థితుల్లో కేవలం సర్టిఫికెట్లు సంపాదించడం కంటే.. సాంకేతికతను వాస్తవ పనిలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యం.
ఏఐ సాధనాలను ఉపయోగించడం, వాటికి సరైన సూచనలు ఇవ్వడం, వచ్చిన ఫలితాలను పరిశీలించడం, తప్పులను గుర్తించడం, చివరకు సరైన నిర్ణయం తీసుకోవడం వంటి నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏఐ, డేటా విశ్లేషణ, కంటెంట్ సృష్టి, డిజిటల్ మార్కెటింగ్, డిజైన్ వంటి రంగాల్లో మైక్రో-ఇంటర్న్‌షిప్పులు విద్యార్థులకు ఉపయోగకరంగా మారుతున్నాయి.
సొంత ప్రాజెక్టు పోర్ట్‌ఫోలియో :
ఒక చిన్న ప్రాజెక్టుతో ప్రారంభించి.. ఆసక్తికి అనుగుణంగా మరిన్ని ప్రాజెక్టులు చేస్తూ వెళ్లొచ్చు. ప్రతి ప్రాజెక్టులో నేర్చుకున్న అంశాలను నమోదు చేసుకుంటే కొంతకాలానికి సర్టిఫికెట్లకు మించి విలువైన ప్రాజెక్టు పోర్ట్‌ఫోలియో సిద్ధమవుతుంది.
ఆన్‌లైన్‌లో స్వల్పకాలిక ప్రాజెక్టులు, వర్చువల్ ఉద్యోగ అనుభవాలు, గిగ్ ఆధారిత పనులు అందించే పలు వేదికలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ విద్య, ఆసక్తి, నైపుణ్యాలకు సరిపోయే అవకాశాలను ఎంచుకుని చిన్న స్థాయి నుంచే ప్రాక్టికల్ అనుభవాన్ని పెంచుకోవచ్చు.
మొత్తంగా చూస్తే.. మైక్రో-ఇంటర్న్‌షిప్పులు కేవలం తాత్కాలిక పనులు కావు. తక్కువ సమయంలో వాస్తవ అనుభవాన్ని అందించే కెరియర్ ప్రయోగశాలలు. చిన్న చిన్న ప్రాజెక్టుల ద్వారా నైపుణ్యాలను పెంచుకుంటూ, పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే పెద్ద అవకాశాలకు విద్యార్థులు మరింత సన్నద్ధంగా ఉండొచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















