జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల్లో బాధితులకు అత్యవసర వైద్యసేవలు త్వరగా అందేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ప్రమాద సమాచారం అందిన తర్వాత అంబులెన్సులు వేగంగా సంఘటనా స్థలానికి చేరుకునేలా కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది.
కొత్త నిబంధనల ప్రకారం.. జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల పరిధిలో జరిగే ఏ ప్రమాద స్థలానికైనా అంబులెన్స్ గరిష్ఠంగా 10 నిమిషాల్లో చేరుకోవాలి. నిర్దేశిత సమయంలోగా చేరుకోకపోతే ఒక్కో ప్రమాదానికి రూ.10 వేల జరిమానా విధించనున్నారు. ప్రమాద స్థలం 10 కిలోమీటర్లకు మించి దూరంలో ఉంటే.. దూరానికి అనుగుణంగా కొంత అదనపు సమయం అనుమతిస్తారు.
ప్రమాద సమాచారం కోసం అత్యవసర టికెట్ స్వీకరించిన తర్వాత బాధితులను సమీపంలోని ఆసుపత్రికి గంటలోపు తరలించాలని NHAI స్పష్టం చేసింది. ఈ గడువులోనూ జాప్యం జరిగితే రూ.10 వేల పెనాల్టీ విధించనున్నారు. అత్యవసర టికెట్‌ను అంబులెన్స్ సిబ్బంది తిరస్కరించినా జరిమానా తప్పదని పేర్కొంది.
అంబులెన్సులు నిర్దేశిత సమయానికి చేరుకుంటున్నాయా లేదా అనే అంశాన్ని వాహనాల్లో అమర్చిన GPS ద్వారా అధికారులు పర్యవేక్షించనున్నారు. అంబులెన్సులతో పాటు క్రేన్లు, పెట్రోలింగ్ వాహనాలు సహా ఇతర ఆన్-రోడ్ యూనిట్ల పనితీరుపైనా పర్యవేక్షణ పెంచనున్నారు.
ప్రమాద నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు NHAI Care Systemను తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం అంబులెన్సుల్లో అవసరమైన పరికరాలు, మందులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. లోపాలు ఉంటే సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకోనున్నారు.
NHAI పరిధిలో ప్రస్తుతం సుమారు 50 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిపై దాదాపు 3,000 అంబులెన్సులు, 1,000 పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి AIS-400 నిబంధనలకు అనుగుణమైన GPS పరికరాలతో పాటు IoT సిమ్‌తో కూడిన ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలు ఉంటాయి.
జాతీయ రహదారులపై ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 1033 హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంది. ప్రమాదాల సమయంలో స్పందనలో జాప్యాన్ని తగ్గించాలని సుప్రీంకోర్టు నియమించిన రోడ్డు భద్రత కమిటీ, CAG నివేదికలు సూచించిన నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని NHAI ఆదేశించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















