కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాల అమలు కోసం 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన 8 జీవోల అమలును నిలిపివేస్తూ స్టే విధించింది. ఈ జీవోల ఆధారంగా ఎంపికైన లబ్ధిదారులకు ఎలాంటి చెల్లింపులు చేయరాదని స్పష్టం చేసింది.
ఈ జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ వ్యక్తిగత హోదాలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ బుధవారం విచారణ చేపట్టారు.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు జారీ చేసిన జీవోలకు తగిన రాజ్యాంగ, చట్టపరమైన ఆధారం లేదని పేర్కొన్నారు.
2014లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన అవివాహిత యువతులకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో పథకాలను ప్రారంభించారని, అనంతరం బీసీ, ఈబీసీ వర్గాలకూ విస్తరించారని వివరించారు. ఆదాయ పరిమితి సహా అర్హత ప్రమాణాలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారో స్పష్టత లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
పథకాల కోసం భారీగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం, చట్టపరమైన నిబంధనలు లేకుండా కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా విధివిధానాలు రూపొందించడం రాజ్యాంగబద్ధం కాదని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాల ప్రకారం 2014 నుంచి ఇప్పటివరకు ఈ పథకాల కోసం రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కోర్టుకు తెలిపారు.
గత విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ హాజరై చట్టపరమైన అంశాలపై కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారని న్యాయమూర్తి గుర్తుచేశారు. అయితే ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదని, ప్రభుత్వ న్యాయవాది మరోసారి గడువు కోరుతున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో 8 జీవోల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. ప్రభుత్వాన్ని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















