తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎత్తైన గోపురాలతో, అబ్బురపరిచే శిల్పకళా వైభవంతో అలరారుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉన్న శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది మే 22, శుక్రవారం అంకురార్పణతో గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాలంటే?
సాధారణంగా ప్రాచీన దేవాలయాల్లో ఏడాదికోసారి జరిగే ఉత్సవాలను బ్రహ్మోత్సవాలని అంటారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్వయంగా ఈ ఉత్సవాలు ప్రారంభించడం వలన ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని పేరు వచ్చింది. ఈ ఉత్సవాలు సాధారణంగా 10 రోజుల పాటు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో స్వామివారు రోజుకొక అవతారంతో భక్తులను అనుగ్రహిస్తారు. బ్రహ్మాండ పురాణంలో ఈ బ్రహ్మోత్సవాలను యజ్ఞంతో సమానమైన ఫలితాన్ని ఇచ్చే ఉత్సవాలుగా పేర్కొన్నారు. అందుకే ఒక గొప్ప యజ్ఞం చేసాక యజ్ఞకర్తలు అవభృథ స్నానం ఎలా చేస్తారో, అలాగే బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక పవిత్ర పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
గోవిందరాజ స్వామి వైభవం
తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్లే భక్తులు గోవిందరాజ స్వామిని కూడా దర్శించుకోవడం సంప్రదాయం. ఈ క్రమంలో గోవిందరాజ స్వామి కోవెల ఎప్పుడు భక్తులతో సందడిగా ఉంటుంది. స్థానికుల కథనం ప్రకారం గోవిందరాజుని శ్రీనివాసునికి అన్నగా భావిస్తారు. శ్రీనివాసుని వడ్డికాసుల్ని కొలవడంతో అలిసి పోయిన స్వామి తలకింద కుంచం అంటే కొలిచే పాత్రను ఉంచుకుని విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతారు. దానికి తగ్గట్లే గర్భాలయంలో స్వామి తలకింద కుంచం పెట్టుకుని విశ్రాంతి భంగిమలో దర్శనమిస్తాడు.
గోవిందరాజుని బ్రహ్మోత్సవ శోభ
తిరుమల శ్రీనివాసుని ఆలయంలో జరిగినట్లే గోవిందరాజ స్వామి ఆలయంలో కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది మే 22, శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు విశేషాలు చూద్దాం.
- మే 22, శుక్రవారం: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో సాయంత్రం జరిగే సేనాపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు.
- మే 23, శనివారం: ఉదయం తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహణం. రాత్రి పెద్దశేష వాహనం
- మే 24, ఆదివారం: ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం
- మే 25, సోమవారం: ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం
- మే 26, మంగళవారం: ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం
- మే 27, బుధవారం: ఉదయం పల్లకిలో మోహిని అవతార ఉత్సవం, రాత్రి గరుడ వాహనం
- మే 28, గురువారం: ఉదయం హనుమద్ వాహనం, సాయంత్రం వసంతోత్సవం, రాత్రి గజ వాహనం
- మే 29, శుక్రవారం: ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
- మే 30, శనివారం: ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం.
- మే 31, ఆదివారం: ఉదయం పల్లకి ఉత్సవం, చక్రస్నానం, తీర్థవారీ అవభృథ స్నానం, సాయంత్రం తిరుచ్చి ఉత్సవం, రాత్రి ధ్వజావరోహణం
శ్రీ గోవిందరాజ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మే 31, ఆదివారం రాత్రి జరిగే ధ్వజావరోహణం తో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ముక్కోటి దేవతలు భూలోకానికి తరలి వస్తారని విశ్వాసం. అందుకే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామిని దర్శించుకోవడం వలన సకల శుభాలు చేకూరుతాయని అంటారు. శ్రీ గోవిందరాజ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వీక్షించడానికి మనం కూడా తరలి వెళ్దాం. గోవిందరాజ స్వామి అనుగ్రహంతో సకల శుభాలు పొందుదాం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















