దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాలు (EV), సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, పరిశోధన-అభివృద్ధి (R&D) రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆయన సంస్థలకు పలు ప్రతిపాదనలు చేశారు.
దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఆటోమోటివ్ మాడ్యూల్స్, కాంపోనెంట్స్, ఎలక్ట్రిఫికేషన్ పరికరాల తయారీ సంస్థ హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్, వైస్ ప్రెసిడెంట్ హన్సోక్ పార్క్, జంగ్‌హో సియోలతో సియోల్‌లో సమావేశమైన మంత్రి లోకేశ్.. ఏఐ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ సెమీకండక్టర్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు.
తిరుపతి–అనంతపురం ప్రాంతంలో ఈవీ కాంపోనెంట్స్, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని, విశాఖపట్నంలో హ్యుందాయ్ మోబిస్ ఆర్&డీ, ఇంజినీరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతపురాన్ని దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి టైర్-1 సరఫరాదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.
భారతదేశంలో తమ విస్తరణ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు, విద్యుత్, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనుమతుల మంజూరులో వేగవంతమైన విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.
మంత్రి ప్రతిపాదనలపై స్పందించిన హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్.. ఏపీ ప్రభుత్వం అందించిన ప్రతిపాదనలను సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అనంతరం సెమీకండక్టర్స్, OSAT (Assembly, Packaging and Testing) రంగంలో ప్రముఖ సంస్థ APACT సీఈవో సియాంగ్ డాంగ్ లీతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ASIP-APACT భాగస్వామ్యంతో విశాఖపట్నంలో OSAT కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు ఆయన సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్‌ను సెమీకండక్టర్ తయారీ రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యాన్ని వివరించారు.
భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని పరిశీలిస్తున్న హనా మైక్రాన్తో పాటు ఇతర అంతర్జాతీయ OSAT కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి సహకరించాలని APACTను మంత్రి కోరారు. సెమీకండక్టర్ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను తయారు చేసేందుకు APSSDCతో కలిసి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతిపాదించారు.
భారతదేశంలో APACT కార్యకలాపాల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని లోకేశ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, వేగవంతమైన అనుమతి వ్యవస్థ పెట్టుబడిదారులకు విశేష ప్రయోజనం చేకూరుస్తాయని వివరించారు.
ఈ సందర్భంగా APACT సీఈవో సియాంగ్ డాంగ్ లీ మాట్లాడుతూ, ASIP-APACT వైజాగ్ OSAT జాయింట్ వెంచర్ ఆంధ్రప్రదేశ్‌కు లభించిన ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ ప్రాజెక్టుగా అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వం అందించిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని, భవిష్యత్తులో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అవకాశాలను అధ్యయనం చేస్తామని తెలిపారు.
దక్షిణ కొరియా పర్యటన ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















