‘బలమైన రాష్ట్రాలే.. మరింత బలమైన భారతదేశానికి పునాది’ అని తమిళనాడు సీఎం విజయ్ పేర్కొన్నారు. గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రాల హక్కులు, ఆర్థిక అంశాలు, మౌలిక వసతులు, నదీ జల వివాదాలు, విద్య, అంతర్రాష్ట్ర సహకారం వంటి పలు అంశాలపై సీఎం విజయ్ తన అభిప్రాయాలను వెల్లడించారు.
సహకార సమాఖ్య విధానమే దేశ బలానికి పునాది అని విజయ్ అన్నారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య, అలాగే రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను విభేదాలతో కాకుండా చర్చలు, పరస్పర గౌరవం, రాజ్యాంగబద్ధమైన విధానాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్రాలు బలంగా ఎదిగితేనే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
డీలిమిటేషన్‌పై స్పష్టత ఇవ్వాలి :
జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగకూడదని విజయ్ స్పష్టం చేశారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గకుండా కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నీట్‌పై రాష్ట్రానికి మినహాయింపు :
తమిళనాడులో నీట్ పరీక్షపై ఉన్న వ్యతిరేకతను కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర కోటాలోని MBBS, BDS, ఆయుష్ సీట్లను ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేసుకునేందుకు తమిళనాడుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాల విద్యా విధానాలు, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఆర్థిక స్వయం ప్రతిపత్తిపై డిమాండ్ :
ఆర్థిక పంపకాల విషయంలో రాష్ట్రాలకు న్యాయం జరగాలని విజయ్ కోరారు. మెరుగ్గా పనిచేస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహం లభించేలా ఆర్థిక వ్యవస్థ ఉండాలని, వాటి అభివృద్ధికి ఆటంకం కలగకుండా మరింత ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జీఎస్టీ రేట్ల నిర్ణయంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
నదీ జల వివాదాలపై దృష్టి :
అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కారంలో దిగువ ప్రాంత రాష్ట్రాల హక్కులను కాపాడాలని విజయ్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులు, ట్రిబ్యునల్ అవార్డులను తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కావేరి, ముల్లై పెరియార్ జల వివాదాలను ప్రస్తావించారు.
డ్రగ్స్ నియంత్రణకు ఉమ్మడి పోరాటం :
దక్షిణాది రాష్ట్రాల్లో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని సీఎం విజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడిని మరింత పెంచాలని, ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ మందుల విక్రయాలపై కఠిన నియంత్రణలు అవసరమని సూచించారు.
దక్షిణాది ఆర్థిక సమైక్యత :
దక్షిణాది రాష్ట్రాల మధ్య ఆర్థిక సహకారం మరింత పెరగాలని విజయ్ ప్రతిపాదించారు. ఉమ్మడి తయారీ కేంద్రాలు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, పారిశ్రామిక, ఫ్రైట్ కారిడార్ల ఏర్పాటుతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచవచ్చని పేర్కొన్నారు.
అలాగే బెంగళూరు-హోసూర్ మెట్రో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు. అంతర్రాష్ట్ర మౌలిక వసతుల సహకారానికి ఈ ప్రాజెక్టు ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
బ్లూ ఎకానమీకి ప్రాధాన్యం :
తీర ప్రాంత రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి బ్లూ ఎకానమీ కీలకమని విజయ్ అన్నారు. పోర్టులు, తీర ప్రాంత షిప్పింగ్, మత్స్య పరిశ్రమ, సముద్ర ఆధారిత పరిశ్రమలు, తీర ప్రాంత పర్యాటక రంగాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడంతో పాటు కోస్టల్ ఎకనామిక్ జోన్లను ఏర్పాటు చేసి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచాలని కోరారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















