ఆహార వస్తువులు, ఇంధన ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ ఊపందుకునే అవకాశాలు ఉన్నప్పటికీ.. వడ్డీ రేట్ల విషయంలో ప్రస్తుతానికి వేచి చూసే ధోరణినే అవలంబించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయించింది. ద్రవ్యోల్బణం భవిష్యత్తులో ఏ స్థాయిలో స్థిరపడుతుందనే దానిపై మరింత స్పష్టత వచ్చే వరకు కీలక రేట్లలో మార్పులు చేయకపోవడమే మంచిదని భావించింది.
ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు జరిగిన ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోతా అధ్యక్షతన సమావేశమైన ఆరుగురు సభ్యుల కమిటీ రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది.
అంచనాలను మించిన ఆర్థిక వృద్ధి :
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ.. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించిందని గవర్నర్ సంజయ్ మల్హోతా తెలిపారు.
సరఫరా వ్యవస్థలో ఎదురయ్యే షాక్‌లు ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా పెంచుతున్నాయనే స్పష్టమైన సంకేతాలు కనిపించినప్పుడు మాత్రమే ద్రవ్య విధానపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు పరిమితంగానే ఉన్నాయని చెప్పారు.
అయితే ధరల ఒత్తిడి మరింత పెరిగి.. ద్రవ్యోల్బణం అదుపు తప్పే పరిస్థితి ఏర్పడితే కీలక వడ్డీ రేట్లను పెంచాల్సి రావచ్చని మల్హోత్రా స్పష్టం చేశారు. అందుకే ప్రస్తుతానికి రేట్లను మార్చకుండా పరిస్థితిని నిశితంగా గమనించాలని ఎంపీసీ నిర్ణయించినట్లు వివరించారు.
అంతర్జాతీయ పరిణామాలపై నజర్ :
అంతర్జాతీయ అనిశ్చితులు, వాతావరణ సంబంధిత ముప్పుల నేపథ్యంలో మరికొంత కాలం వేచి చూడటం సముచితమని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా అభిప్రాయపడ్డారు. సరఫరా ఆధారిత ద్రవ్యోల్బణం ఎంతవరకు ప్రభావం చూపుతుందో అంచనా వేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఆహార, ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలకు విస్తరించలేదని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంద్రనీల్ భట్టాచార్య వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో వెంటనే వడ్డీ రేట్లను మార్చడం కంటే.. ధరల పరిణామాలను మరికొంత కాలం పరిశీలించడం అవసరమని భావించినట్లు తెలిపారు.
ఆర్‌బీఐ ఎంపీసీ తదుపరి సమావేశం 2026 అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరగనుంది. ఆ సమయానికి ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















