రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కదానికీ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలకు ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటి అమలులో విఫలమైందని ఆరోపించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. విశ్రాంత ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలను కూడా ప్రభుత్వం సకాలంలో అందించడం లేదని విమర్శించారు.
ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల చొప్పున పింఛను ఇస్తామని ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. యువతకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, రూ.4 వేల నిరుద్యోగ భృతి, పేద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు వంటి హామీల పరిస్థితి ఏమిటని నిలదీశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోయాయని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి అరకొరగా అమలు చేశారని ఆరోపించారు. పది పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి చివరకు వరికి మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు.
భూమి ఉన్న రైతులు, కౌలు రైతులకు ఎకరానికి ఏటా రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ హామీలకు సంబంధించిన బకాయిలే సుమారు రూ.57 వేల కోట్ల వరకు ఉన్నాయని పేర్కొన్నారు. భూములను నిషేధిత జాబితాలో చేర్చి రైతులు తమ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి కల్పించారని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం విస్మరించిందని కిషన్‌రెడ్డి అన్నారు. బీసీ సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పినా.. మూడేళ్లలో రూ.10 వేల కోట్లు కూడా సక్రమంగా కేటాయించలేదని విమర్శించారు.
ఒకవైపు హామీలను అమలు చేయకుండా మరోవైపు రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టారని ఆయన ఆరోపించారు. భారాస, కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాల్లో పెద్దగా తేడా లేదని, గత 12 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను ఒకే తరహా రాజకీయాలతో మోసం చేస్తున్నాయని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలు మరో 825 రోజుల కోసం ఎదురు చూస్తున్నారని, అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















