తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు తాతా మధును అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కూడా కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కులం పేరుతో దూషించడంతోపాటు అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత
సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ ప్రతినిధులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా తాతా మధు స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఘటనపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ వ్యవహారంపై మధ్యాహ్నం నుంచి శాసనసభ ప్రత్యేకంగా చర్చించింది. ముఖ్యమంత్రి సహా మంత్రులు, కాంగ్రెస్, భాజపా, ఎంఐఎం, సీపీఐ సభ్యులు తాతా మధు వ్యాఖ్యలను ఖండించారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చర్చ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతున్న సమయంలో ఆయన కంటతడి పెట్టడంతో సభలో ఉద్విగ్న పరిస్థితి నెలకొంది.
అరెస్టులపై కేటీఆర్ ఆగ్రహం
తాతా మధు, నవీన్‌రెడ్డిల అరెస్టులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తూ.. 420 హామీలు అమలు చేస్తే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్టవుతామని ఆయన వ్యాఖ్యానించారు.
అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన వ్యవహారంపైనా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాతా మధు, నవీన్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులను కేటీఆర్ ఖండించారు. న్యాయస్థానాల వ్యాఖ్యలు స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే కేసులు నమోదు చేసి అరెస్టులు చేసిందని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వ ‘డైవర్షన్ పాలిటిక్స్’ను గమనిస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















